శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:25 IST)

ఇన్నోవాలో గంజాయి ర‌వాణా... చెక్ పోస్ట్ క‌న్నుగ‌ప్పిన‌ మాఫియా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గంజాయి ర‌వాణా, అక్ర‌మ వ్యాపారం పెరిగిపోతోంది. విశాఖ మ‌ణ్యం నుంచి గంజాయిని అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ, మాఫియా కోట్ల రూపాయ‌ల వ్యాపారం చేస్తోంది. యువ‌త ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తోంది.

ముఖ్యంగా చెక్ పోస్ట్ ల క‌న్ను గ‌ప్పి చాక‌చ‌క్యంగా ఈ గంజాయిని, విజ‌య‌వాడ‌, గుంటూరు, తిరుప‌తి, చెన్న‌య్ వంటి న‌గ‌రాల‌కు అక్ర‌మ ర‌వాణా చేస్తున్నారు. దీనితో మ‌ధ్య‌లో ఉన్న చెక్ పోస్ట్ లు నిఘా వ‌ర్గాలు ఏం చేస్తున్నాయ‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా ప‌లు మార్లు గంజాయి ర‌వాణా చేసిన మాఫియా గుట్టు ర‌ట్ట‌యింది. వి.మాడుగుల నుండి వెంకన్నపాలెం చెక్ పోస్ట్ మీదుగా వస్తున్న అనుమానాస్పద వాహనం ఆప‌గా, అందులో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. ముందస్తు సమాచారంతో తుమ్మాపాల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది, బ్లూ కోల్ట్స్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి గుట్టు ర‌ట్ట‌యింది.

ఇన్నోవా వాహనంలో ఇలా అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 169 పాకెట్ లలో సుమారు 476 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి టౌన్ పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.