శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (14:18 IST)

ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనకు దరఖాస్తుల గడువు పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్(TSIC) ప్రదర్శనకు దరఖాస్తుల గడువును పొడిగించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. 
 
సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్​లైన్​ వేదికగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేటర్(TSIC) ప్రదర్శనకు దరఖాస్తుల గడువును ఆగస్టు పదో తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు ఆవిష్కరణలను ఒకేసారి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో ప్రదర్శించనున్నారు. 
 
జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇన్నోవేషన్ సెల్ పరిశీలించనుంది. అనంతరం వాటిలో ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేయనుంది. కరోనా నేపథ్యంలో ఆన్​లైన్​లో నిర్వహించే ప్రదర్శన ద్వారా ఆవిష్కరణలను చూడవచ్చు. అన్ని రంగాలు, వర్గాల ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది.
 
 ప్రత్యేకించి గ్రామీణ విద్యార్థుల సూక్ష్మ-చిన్నతరహా పరిశ్రమల ఆవిష్కరణలు ఉంటాయి. ఆవిష్కర్తలు తమ ప్రదర్శనకు సంబంధించి ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను జతచేయాలి. ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు, నాలుగు ఫోటోలు తదితర వివరాలను 9100678543 నంబర్​కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది.