సీఎం జగన్‌తో ఆదానీ భేటీ... గంగవరం పోర్టు - వైజాగ్ డేటా సెంటర్‌పై చర్చ
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ ఆదానీ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన... తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నాలుగు గంటల పాటు అక్కడే ఉన్న ఆదానీ.. సీఎం జగన్ నివాసంలోనే రాత్రి విందు భోజనం ఆరగించారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకున్నారు. గౌతమ్ ఆదానీ, సీఎం జగన్ భేటీ గురించి ముందస్తుగా ఎలాంటి అధికారిక సమాచారం కానీ, భేటీ తర్వాత ప్రకటన గానీ ఏపీ ప్రభుత్వం లేదా సీఎంవో చేయలేదు.
అయితే, తమ భేటీ గురించి అదానీ గురువారం అర్థరాత్రి 12 గంటలకు ఓ ట్వీట్ చేశారు. "ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎప్పట్లాగే సానుకూలంగా జరిగింది. ఏపీలో అదానీ సంస్థల పెట్టుబడులు, ముఖ్యంగా, గంగవరం పోర్టు, వైజాగ్ డేటా సెంటర్‌పై చర్చించాం. ఈ ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకమని మేం ఇరువురం భావిస్తున్నాం" అని పేర్కొన్నారు.