గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (17:55 IST)

ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు.. ప్రతి ఓటూ కమలానికే పడాలి.. పవన్ కళ్యాణ్

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల బరి నుంచి జనసేన పార్టీ తప్పుకుంది. ఈ ఎన్నికల్లో తన మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలోని జనసైనికులంతా కలిసికట్టుగా ఉండి బీజేపీకి సహకరించాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా కమలం గుర్తుకు పడేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
నగరంలోని నాదెండ్ల మనోహర్ నివాసంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్‌తో భేటీ అయిన పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2014లో బీజేపీతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పోటీ నుంచి తప్పుకుంటున్నామన్నారు. 
 
జనసైనికులు కాస్త నిరుత్సాహానికి గురైనా, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగర రక్షణ కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నారు. దుబ్బాక ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చిద్దామనుకున్నామని.. కానీ అంతలోనే ఎన్నికలు రావడం వల్ల అది కుదరలేదన్నారు. ఈ సమయంలో ఓట్లు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
నగరంలో బలమైన వ్యవస్థ ఉండాలని, బీజేపీ గెలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలుచోలేదన్నారు. నిరుత్సాహపడొద్దని జనసైనికులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రోడ్ మ్యాప్ రూపొందించుకుంటామన్నారు. 
 
నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన... బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపుతుండగా, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మాత్రం తమకు ఎవరితోనూ పొత్తు లేదని గురువారం స్పష్టం చేశారు. 
 
పవన్ కల్యాణ్, బండి సంజయ్ చర్చలు జరుపుతారని జనసేన పార్టీ ప్రకటన చేయడంతో పొత్తు విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.