మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (22:02 IST)

గోవిందరాజస్వామి ఆలయ కిరీటాలను ఎలా చేశాడో చూడండి

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన మూడు కిరీటాలను దొంగిలించిన దొంగను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 80 రోజుల పాటు నిర్విరామంగా కష్టపడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖాందార్ తాలూకా స్వప్నభూమ్ నగర్‌కు చెందిన ఆకాష్ ప్రతాప్ సరోడిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మూడు కిరీటాలను కరిగించి బంగారుముద్దలా తయారుచేశాడు. వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తిరుపతిలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 
 
మూడు కిరీటాల విలువ 42 లక్షల 35 వేల 385 రూపాయలు విలువ ఉంటుందని, ఫిబ్రవరి 2వ తేదీ నిందితుడు కిరీటాలను దొంగిలించారని ఎస్పీ తెలిపారు. నిందితుడిని సి.సి. కెమెరా ఆధారంగా గుర్తించామన్నారు. 78 సి.సి. కెమెరాల్లో నిందితుడి కదలికలు రికార్డ్ అయ్యాయని, 40 మంది పోలీసులు 80 రోజుల పాటు కష్టపడి నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడు దొంగతనం చేసిన తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల కనిపెట్టడం కష్టమైందన్నారు ఎస్పీ అన్బురాజన్.