శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:53 IST)

గుడ్ జాబ్ ప్రసాద్, కానిస్టేబుల్‌ను అభినందించిన సిఎం జగన్

ఆ ప్రాంతంలో దాదాపు 30 మంది వరద నీటిలో చిక్కుకున్నారు. స్వర్ణముఖి నదికి సమీపంలో ఉండటం మూలాన, నదిలో వరద పోటెత్తి, సమీపంలోని ఇళ్ల వైపు ప్రవహించింది. ప్రకృతి బీభత్సం ఆపగలమా... ఆ ఇళ్ళలోని వారందరూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.
 
వారు తమ మొబైల్ ఫోన్ నుంచి తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చారు. కాపాడాలంటూ వేడుకున్నారు. చిన్న పిల్లలు వృద్ధులు వారిలో ఉన్నారు. అదే వారి జీవితంలో ఈ భూమిపై చివరి రోజని కూడా నిర్ణయించుకున్నారు. కానీ ఏదో ఒక ఆశ.. ఎవరో ఒకరు కాపాడుతారు అన్న ఎదురుచూపు. అదే వారిని బ్రతికించింది... కానిస్టేబుల్ ప్రసాద్ స్థానికుల సహాయంతో తాడును ఉపయోగించి వారిని కాపాడారు.
 
నిజానికి కానిస్టేబుల్ ప్రసాద్ ఆ సమయంలో నైట్ బీట్ డ్యూటీలో ఉన్నారు. ఆయనకు పోలీస్ స్టేషన్ నుంచి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా బాధితులను కలిపారు. బాధితుల లొకేషన్ గుర్తించడానికి ప్రసాద్ చాలా కష్టపడ్డారు. చుట్టూ నీరు ఏ ఇంటిలో ఎంతమంది ప్రాణ భయంతో ఉన్నారు అన్నది ఏమాత్రం తెలియదు. ఓవైపు చిమ్మచీకటి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.. కరెంటు సరఫరా పూర్తిగా ఆగిపోయింది.
 
ఆ గాడాంధకార చీకటిలో కానిస్టేబుల్ ప్రసాద్‌కి స్థానికులు మరో ముగ్గురు తోడయ్యారు. వారి సహాయంతో ఇళ్లల్లో చిక్కుకున్న వారిని కాపాడగలిగారు. ఒక విధంగా వారికి పునర్జన్మ. ఆ రోజు కానిస్టేబుల్ ప్రసాద్ సాహసించి ఉండకపోతే, ఈ రోజు బహుశా ఈ 30 మంది ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించి ఉండేవారు కాదేమో.
 
కేవలం సెల్ ఫోన్‌ లైట్ సహాయంతో ఇండ్ల వద్దకు చేరుకుని వారిని బయటకు తెచ్చారు సురక్షితంగా. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల లోపు ఇద్దరు అమ్మాయిలు అన్విత, శాన్వితలు దాదాపు ఏడు గంటలపాటు వారి ఇంటి సమీపంలోని ఓ చెట్టును పట్టుకొని వరదనీటిలో గడిపారు. ఆ నరకం అనుభవిస్తే గాని చెప్పలేం.
 
కానిస్టేబుల్ ప్రసాద్‌కు సహకరించిన అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసులురెడ్డి, రెడ్డప్ప, మధులు ఆ చిన్నారుల సాహసం చూసి ఆశ్చర్యపోయారు. వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు, ఈస్ట్ డి.ఎస్.పి మురళి కృష్ణ, తిరుచానూరు సి.ఐ లు హుటాహుటిన రేణిగుంట దాటుకుని గాజులమండ్యం మీదుగా పాడిపేట వద్దకు చేరుకున్నారు.
 
అక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతానికి రావడానికి వారికి మార్గం లేదు. ఆ ప్రాంతంలో ఉన్న స్వర్ణముఖి నదిపై నిర్మించిన బ్రిడ్జి వరదకు కొట్టుకుపోయింది. దీంతో యస్.పి అక్కడి నుంచే అవతలివైపు ఉన్న సిబ్బందికి సూచనలు ఇస్తూ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.
       
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా తిరుచానూరుకు సమీపంలోని పాడి పేట చేరుకోగా, ఆయన కోసం ఎంతో ఆత్రుతతో పునర్జన్మ పొందిన వీరు ఎదురుచూశారు. ముఖ్యమంత్రి  అక్కడికి చేరుకోగానే రెండు చేతులతో దండం పెట్టి ప్రాణాలు కాపాడారు అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ 30 మంది ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ప్రసాద్‌తో పాటు శ్రీనివాసులరెడ్డి, రెడ్డప్ప, మధులను కూడా సన్మానించారు. అక్కడే ఉన్న వరద నుంచి కాపాడ బడిన విజయలక్ష్మి, అజయ్, అనూష, అన్విత, శాన్విత, రాజమ్మ, సుశీల, కృష్ణమూర్తి, గీత, కాంచన, సంగారెడ్డి, భాగ్యం, శ్రీనివాసులు, శ్రీదేవి, వెంకటరెడ్డి, రూప, మహేష్‌లు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.