సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:47 IST)

ఏపీ-హైదరాబాదు ప్రయాణికులకు శుభవార్త, ప్రైవేటు బస్సులు రాకపోకలు ప్రారంభం

కరోనావైరస్ ప్రభావం ప్రారంభమయ్యాక దేశవ్యాప్తంగా రవాణా నిలిచిపోవడంతో ఏపీ-తెలంగాణ మధ్య కూడా ప్రైవేటు బస్సులు ఆగిపోయాయి. కేంద్రం అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించినా, అంతర్రాష్ట్ర రవాణాపై నిషేదం ఎత్తివేసినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులు నడపలేక పోయాయి.
 
హైదరాబాదుకు బస్సులు నడిపే విషయంలో ప్రభుత్వాలు మధ్య ఆదిపత్య పోరు కారణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో కేంద్రం విడుదల చేసిన తాజా అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు ప్రకారం ప్రైవేటు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 
ఏపీ- తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రజలు కార్లు, ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే అదునుగా తీసుకొని వీరు అధిక చార్జీలను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైదరాబాదుకు ప్రైవేటు బస్సులను అనుమతించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆపరేటర్లు రాకపోకలు ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ నుంచి హైదరాబాదుకు 150 సర్వీసులు  నడుపుతున్నట్లు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు చెబుతున్నారు.