శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (20:07 IST)

వైఎస్సార్‌ ఆసరా పథకం: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఏంటది?

ys jagan
ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అమలు చేస్తున్న "వైఎస్సార్‌ ఆసరా" పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారు. తాజాగా డ్వాక్రా మహిళలు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 
 
డ్వాక్రా మహిళల వ్యాపారాభివృద్ధికి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎమ్) కింద ఆర్థిక భరోసా కల్పించి మహిళల అభివృద్ధికి చేయూత లభించనుంది. ఇప్పటికే డ్వాక్రా సంఘాల్లో చిన్న తరహా వ్యాపారాలు చేసుకుంటున్న మహిళల్ని గుర్తించి ప్రోత్సాహాన్ని అందించనున్నారు.
 
వచ్చే నెల నుంచి అమల్లోకి తెచ్చేలా కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి డ్వాక్రా సంఘం నుంచి కనీసం ఇద్దరు మహిళా వ్యాపారులను గుర్తిస్తారు. వారి వ్యాపారాభివృద్ధికి అవసరమైన వివరాలు నమోదు చేసుకుంటారు.
 
ఇందుకుగాను రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణంగా ఇస్తారు. ఇప్పటికే ఆయా సంఘాల సభ్యులు రుణం తీసుకొని ఉన్నా అదనంగా అవసరమైన మొత్తాన్ని ఎన్ఆర్ఎల్ఎమ్ అందించడం ద్వారా ఆ మహిళల ఆదాయాన్ని పెంచనున్నారు. 
 
వీరు చేస్తున్న వ్యాపారం, అందులో పురోగతిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఉద్యమి' యాప్‌లో నమోదు చేస్తారు. ఏడాది పాటు వీరి కార్యకలాపాలను సెర్ప్‌ అధికారులు పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు అవసరమైన చేయూత అందిస్తారు. తగిన మార్గనిర్దేశం చేసి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తారు.
 
దశల వారీగా డ్వాక్రా మహిళలకు మహిళల ఖాతాల్లో నాలుగు విడతలుగా నగదు వేస్తారు. ఇప్పటికే మహిళలు తీసుకున్న రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించిన నేపథ్యంలో ఖాతాలకు జమైన మొత్తాన్ని తమ ఆర్థిక ప్రగతి కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కొ 
 
అలాగే డ్వాక్రా మహిళల పథకం కోసం.. బయోమెట్రిక్‌ తప్పనిసరిగా మారింది. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద లబ్ధి పొందనున్న మహిళలకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ తప్పనిసరి చేసింది. వెలుగు సిబ్బంది గ్రూపుల వద్దకు వచ్చినప్పుడు మహిళలు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాలి. 
 
దీని ద్వారా ఎంతమంది మహిళలు ఇతర ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు వలసలు వెళ్లారన్న సమాచారం తెలుస్తుంది. ఒకవేళ  ఆ మహిళ ఆ గ్రామంలో లేకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడ బయోమెట్రిక్‌ పొందే అవకాశం ఉంది. 
 
ఇతర రాష్ట్రం లేదా ఇతర దేశంలో ఉంటే తప్పనిసరిగా రాష్ట్రానికి వచ్చి బయోమెట్రిక్‌ వేయాలి. బయోమెట్రిక్‌ పూర్తికాని మహిళలకు ఆసరా వర్తించదని అధికారులు చెబుతున్నారు.