మంత్రి లోకేశ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?
ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. లోకేశ్ కృషి ఫలితంగా విశాఖలో గూగుల్ కంపెనీతో ఏర్పాటుకు ఒక ఒప్పందం చేసుకున్నట్టు సీఎం వెల్లడించారు. ఈ కంపెనీ ద్వారా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు గూగుల్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.
బుధవారం సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఇందులవో మంత్రి నారా లోకేశ్‌ను చంద్రబాబు మెచ్చుకున్నారు. గూగుల్ కంపెనీ ఏర్పాటుకు కుదిరిన ఎంవోయూతో విశాఖలో అభివృద్ధి మరింత ఊపందుకుంటుందన్నారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వ లక్షణమన్నారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు... స్మార్ట్ వర్క్ కావాలని చెప్పారు. ప్రజాచైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పారిశ్రామిక పాలసీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని వివరించారు. కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోందని తెలిపారు. గూగుల్ కంపెనీతో ఎంవోయూ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో అమరావతిలో భేటీ అయినట్లు సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వైస్ ప్రెసిడెంట్ బికాజ్ కోలీ నేతృత్వంలో గూగుల్ ప్రతినిధి బృందం తనను కలిసిందన్నారు. భారత్‌లో వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వారు తనకు వివరించారని, దేశంలోని వివిధ రాష్ట్రాలను కాదని ఏపీతో గూగుల్ ఒప్పందం కుదుర్చోవడం గర్వంగా ఉందని చెప్పారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.