శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (19:12 IST)

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారక ముందే భక్తులు ఆలయాలకు చేరుకోవడంతో కిక్కిరిసి పోయాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తుల భారీగా తరలివచ్చారు. వీఐపీ బ్రేక్‌ అనంతరం సర్వదర్శనానికి తితిదే ఏర్పాట్లు చేసింది. దీంతో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 
 
వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌, ఏపీకి చెందిన మంత్రులు పుష్ప శ్రీవాణి, పెద్దిరెడ్డి, అనిల్‌, అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆదిమూలపు సురేష్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణకు చెందిన మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి...
ఇక దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఉత్తర ద్వార దర్శనం సాగుతోంది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
 
 స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్‌ దంపతులు, సత్యవతి రాథోడ్‌ వచ్చారు. ఉదయం ఆరుగంటల వరకు ఉత్తరద్వార దర్శనం సాగనుంది. అనంతరం గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేత రాములవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. స్వామివారి వైకుంఠ దర్శనం కోసం భక్తుల పెద్దఎత్తున తరలివచ్చారు.
 
తిరుమలలో మంత్రి హరీష్‌రావుకు తీవ్ర పరాభవం
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు తిరుమలలో తీవ్ర పరాభవం ఎదురైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తిరుమలకు వచ్చారు. కాగా మంత్రి హోదాలో వచ్చిన హరీష్ రావుకు టీటీడీ ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో టీటీడీ వైఖరి పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ దౌత్యంతో హరీష్ రావు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
 
కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తుమ్మలగుంట లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటేత్తారు.. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజంపేట మిథున్ రెడ్డి తదితరులు స్వామివారిని  వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు.. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.