శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (22:17 IST)

రూట్ల ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

మోటారు వాహనాల చట్టాన్ని సవరించి బస్సు రూట్లపై రోడ్డు రవాణా సంస్థలకు ఉన్న గుత్తాధిపత్యాన్ని ఇటీవల తొలగించిన కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జనాభా ఐదు లక్షలు పైబడిన నగరాల్లో రవాణా వ్యవస్థపై దృష్టి సారిస్తోంది.

భవిష్యత్తులో పెరిగే వాహనాల రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా ప్రజారవాణాను బలోపేతం చేయాలని తలపిస్తోంది. జనాభా ఐదు లక్షలు పైబడిన నగరాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్రం సన్నద్ధమైంది. తదనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలన్న సూచనలను పరిశీలనలోకి తీసుకుంది.

ఇందులో భాగంగా ఎంపికచేసిన రాష్ట్రాల్లోని రూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించే దిశగా అధ్యయనం ఆరంభించింది. బ్రిటన్ రాజధాని లండన్‌ తరహాలో ప్రజారవాణా వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. భారీమొత్తంలో అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 
 
అందుకోసం రాష్ట్రాలవారీగా అభిప్రాయాలు సేకరించి కొత్త విధానం అమలుకు అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ త్వరలో ఓ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. లక్ష జనాభాకు 50 బస్సులు రవాణా నిపుణుల లెక్క ప్రకారం లక్ష జనాభాకు 50 బస్సులు అవసరం.

దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి చూస్తే సగటున ప్రతి లక్ష జనాభాకు 18 బస్సులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తీర్ణం పెరిగిన విషయాన్ని పరిగణిస్తూ.. తొలుత లక్ష జనాభాకు బస్సుల సంఖ్యను 30కైనా పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

ఆర్టీసీ తన బస్సులకు అదనంగా ప్రైవేటు బస్సులనూ తీసుకోవాలన్నది ఆలోచన. దీనికి వీలుగా కొత్త విధానానికి ముందుకొచ్చే రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థలకు రూట్‌ పర్మిట్లు ఇచ్చే యోచనను రాష్ట్రాలతో కేంద్రం పంచుకోనుంది. బస్సులు సమకూర్చుకోవడం, గ్యారేజీలు ఇతర ఏర్పాట్లకు అయ్యే మొత్తాన్నీ ప్రైవేటు సంస్థలే భరించనున్నాయి.

రూట్లను బట్టి కిలోమీటర్ల వారీగా ఛార్జీలను ఆ సంస్థలకు రాష్ట్రాలు చెల్లించనున్నాయి. బస్సుల నిర్వహణ, పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచటం, ఇతరత్రా నష్టాల్ని భరించేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రం రుణం తీసుకోబోతున్నట్లు తెలిసింది.

ఏపీ, మహారాష్ట్రలో పైలెట్‌ ప్రాజెక్టు లండన్‌ పర్యటన తర్వాత రాష్ట్రాల వారీగా ఆర్టీసీలు నడిపిస్తున్న బస్సులు.. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వీటి సంఖ్య ఎంత.. అన్నదానిపై కేంద్ర రవాణాశాఖ, ప్రపంచబ్యాంకు బృంద సభ్యులు అధ్యయనం చేస్తున్నారు.

ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు టైర్‌-1లో 80లక్షలు ఆపైన, టైర్‌-2లో 40-80లక్షలు, టైర్‌-3లో 10-40 లక్షలు, టైర్‌-4లో 5-10లక్షల జనాభాగల నగరాలను చేర్చారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో అధ్యయనం చేశారు.

ఏపీలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పరిశీలించారు. ఐదులక్షల పైచిలుకు జనాభాగల నగరాలు ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం సహా ఏడున్నట్లు గుర్తించారు. మిగతా రాష్ట్రాల సమాచారాన్ని సేకరిస్తున్నారు.