బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (08:46 IST)

గుంటూరు ఉపాధ్యాయ స్థానంలో కల్పలత విజయం

గుంటూరు - కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత గెలుపొందారు. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడడంతో ఆమె విజయం సాధించారు. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 
 
ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా కల్పలత మీడియాతో మాట్లాడారు. ‘‘నా విజయం కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నేను స్థానికురాలు కాదనే అభిప్రాయం ఎక్కడా వ్యక్తం కాలేదు’’ అని కల్పలత అన్నారు.
 
ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీచేశారు. 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెల్లని ఓట్లు పోగా కల్పలత విజయానికి 6,153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి 6,153 ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టి కల్పలతను విజేతగా ప్రకటించారు.