ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 16 మార్చి 2021 (23:37 IST)

India vs England: మూడో టీ20లో ఇంగ్లండ్ గెలుపు, సిరీస్‌‌లో 2-1తో ఆధిక్యం

భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. అంతకుముందు.. ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో తడబడిన భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

 
ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగుల లక్ష్యాన్ని 10 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. భారత జట్టులో విరాట్ కోహ్లీ అజేయంగా 77 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టులో జాస్ బట్లర్ 83 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 23 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది.

 
ఓపెనర్ జేసన్ రాయ్ 9 పరుగులు చేసి యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ జాస్ బట్లర్ హాఫ్ సెంచరీ చేశాడు. జాస్ బట్లర్, డేవిడ్ మలన్ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. 81 పరుగుల దగ్గర ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో డేవిడ్ మలన్ (18)ను కీపర్ రిషబ్ పంత్ స్టంప్డ్ చేశాడు.

 
10 ఓవర్లకు ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు 15 ఓవర్లకు మరో వికెట్ కోల్పోకుండా 127 పరుగులు చేసింది. గెలుపు కోసం మిగిలిన 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉండగా.. మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం ఛేదించింది. 18.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగుల చేసింది. ఇంగ్లండ్ జట్టులో బట్లర్ 83 పరుగులు చేయగా, బేర్‌స్టో 40 పరుగులు చేశాడు. భారత బౌలర్లు సుందర్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యం సాధించింది.

 
ఆరంభంలో తడబడిన భారత్..
ఆరంభంలో ఆరో ఓవర్‌లోనే 24 పరుగులకే మూడు వికెట్లు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో విరాట్ కోహ్లీ మెరుపులు చూపించాడు. కోహ్లీ 46 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ 25 పరుగులు, హార్దిక్ పాండ్యా 17 పరుగులు, రోహిత్ శర్మ 15 పరుగులు చేశారు. పది ఓవర్లు ముగిసే సరికి 55 పరుగులు చేసింది. 12వ ఓవర్‌లో రిషబ్ పంత్, 15వ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యారు. అప్పటికి భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ ముగిసే సరికి విరాట్ కోహ్లీ అర్థ శతకం సాధించాడు. భారత జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులుగా ఉంది.

 
మూడో ఓవర్‌లో తొలి వికెట్...
అంతకుముందు.. ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్ ఆరంభించారు. భారత జట్టు మూడో ఓవర్‌లో తొలి వికెట్ కోల్పోయింది. మార్క్ వుడ్ బౌలింగ్‌లో కె.ఎల్.రాహుల్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. అప్పటికి భారత జట్టు ఏడు పరుగుల వద్ద ఉంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ (15 పరుగులు) అవుటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కి క్యాచ్ ఇచ్చాడు.

 
ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు స్కోరు రెండు వికెట్లకు 24 పరుగులుగా ఉంది. ఆరో ఓవర్ రెండో బంతికి ఇషాన్ కిషన్ (4 పరుగులు) కూడా ఔటయ్యాడు. క్రిస్ జోర్డన్ బౌలింగ్‌‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 12వ ఓవర్ మొదటి బంతికి రిషబ్ పంత్ (25 పరుగులు) రనౌటయ్యాడు. భారత జట్టు స్కోరు 13 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లకు 74 పరుగులు.

 
15వ ఓవర్‌లో 86 పరుగుల వద్ద భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. మార్క్ వుడ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ (9 పరుగులు).. డావిడ్ మలన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 17వ ఓవర్‌లో కోహ్లీ 50 పరుగులు (37 బంతుల్లో) పూర్తిచేశాడు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

 
చివరి ఓవర్‌ చివరి బంతికి హార్దిక్ పాండ్యా జోర్డాన్ బౌలింగ్‌లో ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. భారత జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్‌ మూడు వికెట్లు, క్రిస్ జోర్డన్ రెండు వికెట్లు తీశారు.

 
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ మొదలైంది. ఇయాన్ మోర్గన్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీమ్ జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగింది. టామ్ కరాన్ స్థానంలో మార్క్ వుడ్‌ను తీసుకువచ్చింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు కూడా ఒక మార్పు చేసింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో రోహిత్ శర్మను బరిలోకి దించింది.

 
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్, రెండో మ్యాచ్‌లో భారత్ గెలిచాయి. దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సిరీస్‌లో మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ సోమవారం ప్రకటించాయి.