ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (08:53 IST)

తెలంగాణకు లాభాలు అప్పగించి, ఏపీఎస్ ఆర్టీసీకి నష్టాలు: టీడీపీ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీస్థాయిలో రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెట్టి సొంతఅజెండా, స్వప్రయోజనాకోసం పాకులాడుతుంటే, మంత్రులు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారని, దానికి ప్రత్యక్షఉదాహరణ తెలంగాణ-ఏపీ మధ్య నడుపుతున్న అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసులే నిదర్శనమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...!
 
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కేసీఆర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగి, తనను, కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలని ఉపన్యాసాలిచ్చి, ప్రగతిభవన్ కు వెళ్లిమరీ పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రికి శాలువాలు కప్పివచ్చిన జగన్ హానీమూన్ పీరియడ్ ముగిసిట్టుంది. పక్క రాష్ట్రంతో ముడిపడిన ప్రతి అంశంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలారు.

నీటిపంపకాలు, ఆస్తులవిభజన, ఇరిగేషన్ ప్రాజెక్టులు సహా, అనేక అంశాల్లో స్వరాష్ట్రానికే తీరని అన్యాయం చేసిన జగన్, తెలంగాణకు తిరిగే ఆర్టీసీ బస్సుల విషయంలోకూడా ఏమీ చేయలేకపోవడం దారుణం. దసరా సమయంలో పొరుగు రాష్ట్రానికి బస్సులుకూడా తిప్పలేకపోయారు. ఇప్పుడేమో తెలంగాణతో ఆర్టీసీబస్సులు తిప్పే  అంశంలో చేసుకున్న ఒప్పందం చూస్తే, ఈ ప్రభుత్వం ఇంతచేతగాని ప్రభుత్వమైందా అనిపిస్తోంది.

రవాణామంత్రి పేర్నినాని ఇసుకదందాలు చేసుకుంటూ, రోజువారీ వసూళ్లు చేసుకుంటూ, తీరికలేకుండా గడుపుతూ, తెలంగాణలో జరిగిన చర్చలకు వెళ్లలేకపోయాడు. రవాణాశాఖగురించి, ఆర్టీసీ సర్వీసులగురించి మాట్లాడటం చేతగాదుకానీ, మీడియా ముందుకొచ్చి, ప్రభుత్వం విధించే అడ్డగోలు జరిమానాలను సమర్థించడం మాత్రం ఆయనకు బాగాతెలుసు.

తెలంగాణరాష్ట్రానికి ఇదివరకు ఏపీ నుంచి 1009 ఆర్టీసీ సర్వీసులు తిరిగేవి. ఇప్పుడు ఆసర్వీసుల్లో దాదాపు 371కి కోతపెట్టి, 638 సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే, ఇలాంటి పనులుచేస్తారా? రెండునెలల నుంచీ తెలంగాణతో చర్చిస్తున్నామని చెప్పిన పేర్నినాని, 371 సర్వీసులకు కోతపెట్టాడు. అసలే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంటే, దాదాపు లక్షకిలోమీటర్లవరకు తగ్గించేశారు.

మన రాష్ట్రానికి చెందిన ఆర్టీసీబస్సులు గతంలో 2,65,363 కిలోమీటర్లవరకు తెలంగాణలో  తిరిగేవి.  ఇప్పుడేమో లక్షా5వేలకిలోమీటర్ల వరకు మైలేజీ తగ్గించేశారు. లక్షా5వేలకిలోమీటర్ల మైలైజీలో కోతపెట్టి, 371 సర్వీసులకు ఎగనామం పెట్టి, ఇటువంటి ఒప్పందాలకు ఒప్పుకోవడమేనా ఈప్రభుత్వం సాధించిన ఘనత?

ఈ ప్రభుత్వ దిక్కుమాలిన నిర్ణయం కారణంగా, పాలకులచేతగానితనం వల్ల ఏటా ఏపీఎస్ఆర్టీసీకి రూ.273 కోట్లవరకు నష్టం వస్తుంది.  పార్లమెంట్ లో ఎంపీలున్నారు... పోరాటం చేస్తాం.. అవితెస్తాం.. ఇవి సాధిస్తామని చెప్పడమేగానీ, చేసిందేమీ లేదు. అటువంటి దద్దమ్మలు, పేర్నినాని లాంటి చేతగానిమంత్రులు ఎంతమంది ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి?

మంత్రి హోదాలో హైదరాబాద్ వెళ్లి, తెలంగాణ మంత్రితో చర్చించలేని వ్యక్తి, ఏముఖం పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? ఇక్కడ దోచుకుంటున్న సొమ్ముతో  హైదరాబాద్ లో  పోగేసుకుంటున్న వారిఆస్తులను కాపాడుకోవడానికి మరీ ఇంతలా దిగజారి, రాష్ట్రానికి అన్యాయంచేసి, తెలంగాణకు మేలుచేస్తారా? తెలంగాణ నుంచి ఏపీకి తిరిగే ఆర్టీసీ సర్వీసులను మాత్రం 746 నుంచి 826కు పెంచుకున్నారు.

గతంలో తెలంగాణ ఆర్టీసీసర్వీసులు ఏపీలో లక్షా 3వేలకిలోమీటర్లు తిరిగితే, ఇప్పుడేమో దాన్ని లక్షా60వేల కిలోమీటర్ల వరకు పెంచారు. అంటే దాదాపుగా 58వేల కిలోమీటర్ల వరకు ఏపీలో తెలంగాణ సర్వీసులు తిప్పుకునే వెసులుబాటును ఈ అసమర్థ ప్రభుత్వం కల్పించింది. తెలంగాణకు పెరిగిన సర్వీసులు వల్ల ఆరాష్ట్రానికి ఏపీభూభాగం నుంచి దాదాపు రూ.300కోట్ల ఆదాయం రాబోతోంది.

తెలంగాణకు అన్నీ లాభాలు కల్పించి, ఏపీకి నష్టంచేయడమేనా జగన్ ప్రభుత్వం సాధించిన ఘనత?  రూట్లవారీగా చూస్తే, అన్నింటికంటే లాభదాయకమైన విజయవాడ - హైదరాబాద్ మధ్య గతంలో ఏపీఎస్ ఆర్టీసీనుంచి  374 సర్వీసులు తిరుగుతుంటే, వాటిని ఇప్పుడు 192కు కుదించారు. విజయవాడ – హైదరాబాద్ రూట్లో 182 సర్వీసులకు కోతపెట్టి, దానివల్ల ఏపీఎస్ ఆర్టీసీకి తీరని నష్టం మిగిల్చారు.

హైదరాబాద్-కర్నూలు రూట్లో టీఎస్ ఆర్టీసీ 213సర్వీసులుతిప్పితే, ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం కేవలం 146సర్వీసులు మాత్రమే తిప్పేలా ఒప్పందం చేసుకున్నారు.  దానివల్ల 25వేలకిలోమీటర్ల మైలైజీలో కోతపెడితే, విజయవాడ హైదరాబాద్ రూట్లోనేమో 51వేల కిలోమీటర్ల మైలేజీవరకు కోతపెట్టారు. మాచర్ల  రూట్లో టీఎస్ ఆర్టీసీ 66 సర్వీసులు తిప్పితే, మనరాష్ట్రం మాత్రం 61 సర్వీసులకే పరిమితమైంది.

ఖమ్మం – జంగారెడ్డిగూడెం రూట్లోటీఎస్ ఆర్టీసీ 58 సర్వీసులు తిప్పితే, ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం 35 సర్వీసులకే పరిమితమైంది.  శ్రీశైలం రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ ఒక్క సర్వీసు కూడా లేకుండా చేశారు. తెలంగాణ మాత్రం 62 సర్వీసులు తిప్పుకోవచ్చంట. ఇటువంటి దిక్కుమాలిన ఒప్పందాలపై సంతకాలు పెట్టి, రాష్ట్రానికి నష్టం కలిగిస్తారా?

పోలవరాన్ని, అమరావతిని అటకెక్కించారు. ఇప్పుడేమో ఏపీఎస్ఆర్టీసీని అటకెక్కించి, సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. నష్టానలు సాకుగా చూపి, ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుంది?

గతంలో ఏపీఎస్ఆర్టీసీని ఆదుకోవడానికి టీడీపీప్రభుత్వం రూ.450కోట్లను, బస్సుల కొనుగోళ్లకు కేటాయించడం జరిగింది. బడ్జెట్లో రూ.1000కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రూ.390కోట్ల పీఎఫ్ బకాయిలను ఆర్టీసీఉద్యోగులకు చెల్లించిన ఘనత కూడా టీడీపీప్రభుత్వానిదే. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చంద్రబాబునాయడు 43శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. 

ఆ విధంగా వేలాదికోట్లను ఏపీఎస్ ఆర్టీసికి చంద్రబాబునాయడు ప్రకటించి, ఉద్యోగులను ఆదుకొని, సంస్థను బతికించారు. టీడీపీప్రభుత్వం వచ్చేనాటికి ఆక్యుపెన్సీ రేషియో కేవలం 65శాతంగా ఉండేది. అటువంటి దాన్ని 85 నుంచి 88శాతానికి పెంచడం జరిగింది. ఈ రకంగా అన్నివిధాలుగా పేదల రవాణా వ్యవస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీని టీడీపీప్రభుత్వం బతికించింది. 

అటువంటి సంస్థను నాశనం చేయడానికి ఇప్పుడు అధికారంలోఉన్నవారు,  తెలంగాణతో దిక్కుమాలిన  ఒప్పందాలు చేసుకుంటారా? 371 సర్వీసులకు కోతపెడతారా?  లక్షా 5వేలకిలోమీటర్ల వరకు మైలేజీ లో కోతపెడతారా? రూ.271కోట్ల నష్టాన్నిఏపీకి మిగులుస్తారా?

ఇటువంటి పనులు చేసినందుకు సిగ్గుపడండి. పేర్నినాని లాంటి చేతగాని మంత్రులు, దిక్కుమాలిన ఒప్పందాలతో రాష్ట్రానికి నష్టంచేసే అటువంటి వ్యక్తులు ప్రజలకు అనవసరం. తక్షణమే ఆయన తనపదవికి రాజీనామా చేస్తే మంచిది. 
 
ఏపీఎస్ ఆర్టీసీ గతంలో ఎన్ని సర్వీసులు అయితే నడిపిందో, ఇప్పుడు కూడా అలానే నడుపుతుందని, తెలంగాణ మాత్రం కొన్ని సర్వీసులు పెంచుకోవచ్చని ప్రతిపాదనలు చేశారు. దానికి తెలంగాణ ప్రభుత్వం తాము సర్వీసులు పెంచుకుంటాము.. మీరు మాత్రం సర్వీసులు తగ్గించుకోవాలని ఏపీ అధికారులకు షరతు పెట్టారు. ఈ చేతగాని దద్దమ్మలు తెలంగాణ ప్రభుత్వ షరతుకు తలూపి, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం మిగిల్చారు. 

ఈ విధమైన ఒప్పందానికి తలూపడం సరికాదు. తక్షణమే జగన్ ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ఒప్పందాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ భూభాగానికి ఎన్ని సర్వీసులు అయితే తిప్పిందో, అన్నేసర్వీసులు (1009) తిరగాల్సిందే. గతంలో ఏపీఎస్ ఆర్టీసీ 2,65,367కిలోమీటర్ల మైలేజీ ఏదైతే సాధించిందో,  అంతేమొత్తంలో దక్కేల చూడాలని కోరతున్నాం.

రూ.271కోట్ల నష్టమేదైతే ఉందో, ఆ మొత్తం రాష్ట్రంపై పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంసాధించి తీరాల్సిందే. రూట్లలో పెట్టిన కోతలను కూడా తగ్గించాల్సిందేనని స్పష్టంచేస్తున్నాం. గతంలో ఆయా రూట్లలో ఎలాగైతే సర్వీసులు తిరిగాయో అలానే తిరిగేలా చూడాలని కోరుతున్నాం. పేర్నినాని తన ఇసుకదందాలు ఆపేసి, ఇప్పటికైనా ఏపీఎస్ ఆర్టీసీపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం.