శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (11:38 IST)

జగన్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు.. పరిషత్ ఎన్నికలు రద్దు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు తేరుకోలేని షాకిచ్చింది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని ఏపీ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌న్న ఆదేశాలను పాటించ‌లేద‌ని వివ‌రించింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో నిబంధ‌న‌లు అమ‌లు కాలేద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.
 
కాగా, ఏపీలో పరిషత్‌ ఎన్నికల రీ షెడ్యూల్ ఏప్రిల్ 2న‌ విడుదలైన విష‌యం తెలిసిందే. అదే రోజున నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 8న పోలింగ్‌ నిర్వహించి, 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. 
 
అయితే, ఎన్నిక‌లు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ, కోర్టు ఆదేశాల మేర‌కు ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌లేదు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నూతన ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంట‌ల‌కే ఈ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఇపుడు ఈ నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.