1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (09:52 IST)

నేడు రఘురామ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో శుక్రవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనుంది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం నేటి మధ్యహ్నం 12 గంటలకు ఈ కేసును విచారించనుంది. 
 
ఏపీలోని వైకాపా ప్రభుత్వం రఘురామపై రాజద్రోహం కేసును నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ప్రసుత్తం రఘురామ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, ఈ వైద్య పరీక్షల నివేదిక కూడా సుప్రీంకోర్టుకు చేరింది. 
 
మరోవైపు, బెయిలు కోసం రఘురామ పెట్టుకున్న స్పెషల్‌ లీవ్ పిటిషన్‌కు కౌంటర్‌గా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కూడా పరిశీలనలో ఉంది. గురువారం జరిగిన విచారణలో రఘురామ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రఘురామ రాజు తన ప్రసంగాల్లో ఎక్కడా హింసను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. 
 
తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఉద్దేశంతో ఇప్పటికే వై సెక్యూరిటీని కూడా పొందారని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఆయనకు బెయిలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. రఘురామ పిటిషన్‌కు జవాబిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం వరకు వాయిదా కోరింది. పైగా, గురువారం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది.