బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (14:20 IST)

రఘురామ రాజు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా... కానీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ వైకాపాకు చెందిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదావేసింది. 
 
విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రఘురాజును ఆసుపత్రికి తరలించడంపై మధ్యాహ్నం ఒంటిగంటకు తుది ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
 
మరోవైపు, రఘురాజుకు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టును ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ, మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించవచ్చని చెప్పారు. దీనిపై రోహత్గి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి పాలకమండలిలో ఇద్దరు వైసీపీ ఎంపీలు ఉన్నారని... వీలైతే ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురాజు పిటిషన్ వేశారని... అందుకే ఆయనపై కేసులు వేశారని... ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం నుంచి పలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. 
 
మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది దవే మాట్లాడుతూ, రఘరాజుకు ఆసుపత్రిలో చేరేందుకు అనుమతిని ఇవ్వకూడదని కోరారు. కేవలం చికిత్సకు మాత్రమే అనుమతించాలని అన్నారు. మరోవైపు సొటిసిటర్ జనరల్ మాట్లాడుతూ, ఆర్మీ ఆసుపత్రిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ప్రశ్నించారు. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో రాజకీయాలకు అవకాశం లేదని... ఒక న్యాయవాది సమక్షంలో చికిత్స చేయించవచ్చని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, వైద్య చికిత్సపై సుప్రీం ఎలాంటి ఉత్తర్వులను జారీ చేయనుందనే ఉత్కంఠ నెలకొంది.