శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మే 2021 (19:30 IST)

జగన్‌కు ప్రధానమంత్రి కావాలని ఉంది: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రధానమంత్రి కావాలని ఉందని అన్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కూడగట్టిన డబ్బులతో ప్రధానమంత్రి కావాలన్న ఆయన కోరికను పైనున్న దేవతలు, ఆయన నమ్మిన క్రీస్తు కూడా హర్షించరని అన్నారు.
 
ఏపీలో కరోనా బాధితులకు చాలా అన్యాయం జరుగుతోందని రఘురామ విమర్శించారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకునేవారు లేరని, సీఎం జగన్ నిర్లక్ష్యంవలనే 46 మంది చనిపోయారని ఆరోపించారు. 
 
మన తప్పు కానప్పటికి మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రఘురామ మండిపడ్డారు. సీఎం తన జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడంకాదని.. జగన్‌పై కేసు పెట్టాలన్నారు. 
 
రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుంటే రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టకుండా కర్ఫ్యూ పెట్టడమేంటని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ప్రాణాలు, శవాలతో వ్యాపారం చేయడం సరికాదని రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు.