గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (17:08 IST)

మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉంది.. తిరుపతి సభ రద్దు: ఏపీ సీఎం

సీఎం జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు జగన్‌ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని, 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో.. నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 
 
నెల్లూరు జిల్లాలో కూడా ఒక్కరోజులోనే 292 కేసులు వచ్చాయన్నారు. ఇవాళ కరోనా బులెటిన్‌ చూశాక.. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నా అన్నారు. ''మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు.
 
మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉంది'' అని లేఖలో రాశారు. బాధ్యతగల సీఎంగా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నానని, ఇటీవల తాను రాసిన లేఖలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానన్నారు. వాటిని గమనించి తన సోదరుడు గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
 
మరోవైపు ఏఐఎస్ సర్వీస్ రూల్స్‌లో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‍ల పనితీరు నివేదికను సీఎం ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ జారీ చేశారు. సీఎం నివేదిక ఆధారంగానే కేంద్ర సర్వీసులకు వెళ్లే అవకాశం ఉంది. ఐఏఎస్‍ల పదోన్నతుల విషయంలోనూ సీఎం నివేదికే కీలకం. గవర్నర్ కార్యదర్శికి మాత్రం సీఎం అథారిటీ నుంచి మినహాయింపు ఇచ్చింది.