గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:55 IST)

జగన్ హిందువు కాదు క్రైస్తవుడు: పరిపూర్ణానందస్వామి

ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు.. క్రైస్తవుడని స్పష్టం చేశారు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ హిందువని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ ప్రమేయం లేని స్వచ్ఛమైన హిందువులతో టిటిడి బోర్డు ఏర్పాటు చేయలేరా అంటూ ప్రశ్నించారు పరిపూర్ణానందస్వామి.
 
రాయలసీమ ఆధ్మాత్మిక వైభవాన్ని నాయకులు చాటిచెప్పలేకపోతున్నారని విమర్సించారు. రాయలసీమ విలువలను జాతీయస్థాయిలో నిలబెట్టేలా ఓటర్లు ఆలోచించాలన్నారు. వైసిపి ప్రభుత్వంలో 350 ఆలయాలు కూలిపోయాయని.. దేవదాయశాఖామంత్రి సిఎంకి చెప్పినా స్పందించరా అంటూ ప్రశ్నించారు.
 
తిరుమల శ్రీవారి ఆస్తులు, భూములు, క్రయ విక్రయాలపై 25 సంవత్సరాల శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి టిటిడిని తీసుకురావాలన్నారు. ఆలయంలో అన్యమతస్తులు పేరుకుపోతున్నా ఎవరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
 
పింక్ డైమండ్ వ్యవహారం ఏమైందని ప్రశ్నించిన పరిపూర్ణానందస్వామి అధికారంలోకి రావాలంటే శ్రీవారిపై మాట్లాడాలనే భావజాలం ఏర్పడిపోయిందన్నారు. దేవుడు గుర్తుకు రావాల్సిన ప్రాంతం కేంద్రంగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి అంటేనే వివాదాల పుట్టగా మారిపోయిందన్నారు పరిపూర్ణానందస్వామి.