మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (18:38 IST)

సీఎం పదవి భారతికో, విజయమ్మకో కట్టబెట్టి జగన్ ఆ పని చేయాలి: వైకాపా ఎంపీ

మంత్రిపదవిని అడ్డుపెట్టుకుని వసూళ్ళకు పాల్పడ్డారన్న ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో మహారాష్ట్ర హోం మంత్రి తన పదవికి రాజీనామా చేశారని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గుర్తుచేశారు. ఒక్క ఆరోపణకే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తే.. 11 సీబీఐ చార్జిషీటుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్ సీఎం కుర్చీలో ఎలా కొనసాగుతారని వైకాపా ఎంపీ ప్రశ్నించారు. 
 
నిజానికి ఏపీ సీఎం జగన్ ఆస్తుల వ్యవహారంలో గత కొన్నేళ్లుగా సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. 11 సీబీఐ చార్జిషీట్లతో సీఎం జగన్ ఏ1 ముద్దాయిగా ఉన్నారని, అలాంటి వ్యక్తి అభివృద్ధి పనులంటూ కోర్టుకు హాజరుకాకపోవడం సబబేనా? అని ప్రశ్నించారు. 
 
అందుకే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. న్యాయవ్యవస్థ నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలని అన్నారు. సహ నిందితులుగా ఉన్న కొందరికి రాజకీయ పదవులు ఇచ్చారని, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారన్నారు. 
 
ఇవన్నీ తోటి నిందితులను ప్రభావితం చేయడం కాదా? అని నిలదీశారు. ఇంత జరుగుతుంటే సీబీఐ ఏంచేస్తోంది? అని ప్రశ్నించారు. కేవలం ఆరోపణ వచ్చినందుకే మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేశారని, ఇన్ని చార్జిషీట్లలో పేరున్న జగన్ ఆయనను ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదని ప్రశ్నించారు. 
 
సీఎం పదవిని భారతికో, విజయమ్మకో ఎవరికిస్తారో మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. కానీ, మహారాష్ట్ర హోంమంత్రిని ఆదర్శంగా తీసుకుని సీఎం పదవికి రాజీనామా చేయాలని రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే, జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన తెలిపారు.