గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:46 IST)

విశాఖ ప్లాంట్‌పై మాట్లాడే ధైర్యం దమ్మూ జగన్‌కు ఉందా?: చంద్రబాబు గర్జన

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కుగా పరిగణిస్తూ వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడే దమ్మూధైర్యం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలదీశారు.
 
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా పొదలకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడే ధైర్యమే సీఎం జగన్‌కు లేదన్నారు. ఈ రెండేళ్లలో ఏం చేశారని వైకాపాకు ఓటేయాలని ప్రశ్నించారు. విభజన చట్టంలోని సమస్యలు పరిష్కరించే బాధ్యత లేదా? నిలదీశారు. 
 
'ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా మద్యంలో కొత్త బ్రాండ్‌లు తెచ్చారు. మద్యపాన నిషేధం అంశంపై సీఎం జగన్‌ నమ్మకద్రోహం చేశారు. నిత్యావసరాలు, పెట్రోలు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫైబర్‌ గ్రిడ్‌ ధర రూ.150 నుంచి రూ.400కు పెంచారు. నాకంటే బాగా చేస్తాడని భావించే ప్రజలు జగన్‌కు ఓటేశారు. ఎవరు బాగా పరిపాలించారో ప్రజలు సావధానంగా ఆలోచించాలి. 
రేపటి నుంచి ప్రతి విషయంలో పన్నులు వేస్తారు. మేం ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఇప్పుడు దానికి రెక్కలొచ్చాయి. ట్రాక్టర్‌ ఇసుకకు ప్రస్తుతం రూ.5వేలు తీసుకుంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి కార్మికులు ఉపాధి కోల్పోయారు. వైకాపా పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం జరిగింది' అని ఆరోపించారు.
 
టీడీపీ దెబ్బకు సీఎం జగన్ కూడా ప్రచారానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. "ఇంకొకాయన పుంగనూరు నుంచి వస్తున్నాడు పెద్ద మగాడు... పోతూ ఉంటే మనుషుల్ని తీసుకువచ్చి తొక్కించుకుంటూ వెళతాడట. మాక్కూడా సమయం వస్తుంది... మీరంతా జిల్లాలోనే ఉంటారు... మీలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టం... ఎక్కడున్నా పట్టుకొచ్చి మరీ మావాళ్ల కోరిక తీరుస్తా. నేను రాజకీయాలు చేస్తుంటే గోలీ కాయలు ఆడుకునే వ్యక్తి వచ్చి ఏదో చేస్తాడంట" అని వ్యంగ్యం ప్రదర్శించారు.
 
పరిషత్ ఎన్నికల బరిలో టీడీపీ లేకపోయినా రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు భయపడవద్దని, ఎదురొడ్డి నిలిచే కార్యకర్తలకు భవిష్యత్తులో సన్మానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇవాళ జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిగెత్తుకుంటూ తిరుపతి వస్తున్నాడంటే అది మీ చలవేనని టీడీపీ కార్యకర్తల్లో చంద్రబాబు హుషారు నింపే ప్రయత్నం చేశారు. న్యాయం, ధర్మం నిలిపే సైనికులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తన కార్యకర్తలే తన సైన్యమని ఉద్ఘాటించారు.