మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (20:30 IST)

ఒకే రోజు బాబుకు రెండు దెబ్బలు: తెలంగాణలో టిడిపి క్లోజ్, వైసిపిలోకి తెదేపా మాజీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఒకే రోజు రెండు దెబ్బలు తగిలాయి. ఒకటి తెలంగాణ నుంచి అయితే మరొకటి ఏపీ నుంచి.
 
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు. ఆ ఇద్దరిలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా మరొకరు మెచ్చా నాగేశ్వర రావు. వీరిరువురిలో సండ్ర కొద్దికాలానికే కారు ఎక్కేశారు. దాంతో మెచ్చా మాత్రమే మిగిలిపోయారు. అలా తెలంగాణలో తెదేపాకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.
 
ఐతే ఈరోజు ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. దానితో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖతమైపోయినట్లయింది. తమ పార్టీని తెరాసలో విలీనం చేస్తున్న సండ్రతో కలిసి మెచ్చ స్పీకర్ పోచారానికి లేఖ ఇచ్చారు. దీనితో ఆ పార్టీ ఇక తెలంగాణలో కనుమరుగైపోయినట్లే.
 
ఇక ఏపీ విషయానికి వస్తే... బాపట్ల నియోజకవర్గంలో ఎప్పటి నుంచి రాజుల కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. అలాంటిది ఈరోజు తెదేపాకి చెందిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఒకే రోజు చంద్రబాబుకి రెండు దెబ్బలు తగిలాయి.