ఏపీలో భూముల ధరలు పడిపోవడానికి కారణం చంద్రబాబే : మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయి, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోవడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఏపీ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చంద్రబాబే ఆ విధంగా వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు.
గతంలో ఏపీలో ఒక ఎకరం పొలం అమ్మితే తెలంగాణాలో మూడు ఎకరాల పొలం కొనుక్కునేవారు. అలాగే, తెలంగాణాలో మూడు ఎకరాలు అమ్మితేగానీ, ఏపీలో ఒక్క ఎకరం భూమి వచ్చేదికాదని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వీటిపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీలో ఎకరం భూమి విలువ రూ.10 లక్షలకు పడిపోయిందని, అందుకు కూడా చంద్రబాబు గత విధానాలే కారణమని, ఆయన పార్టీని ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా కాపాడలేకపోయారని సెటైర్లు వేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రూ.3.60 లక్షల కోట్ల అప్పులను తీసుకుని రాలేదా? అని ప్రశ్నించిన ఆయన, త్వరలో తిరుపతిలో జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించనుందని జోస్యం చెప్పారు.
అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడేనని, ఆయన సీఎంగా ఉన్న వేళ, కేసీఆర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునివుంటే, ఆయన పార్టీని పెట్టేవారు కాదని, విభజన కూడా జరిగి ఉండేది కాదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం భూమిని అమ్మితే, ఏపీలో మూడు ఎకరాలు కొనవచ్చని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబే కారణమని కొడాలి నాని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రాకుండా చేయాలన్నది బాబు కుట్రగా ఉందని ఆరోపించారు.