ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలి : వైకాపా ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఆ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌తో పాటు పలు పత్రాలను కోర్టుకు ఆయన సమర్పించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ 11 ఛార్జ్ షీట్లను నమోదు చేసిందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అన్ని ఛార్జిషీట్లలో ఆయన ఏ-1గా ఉన్నారని తెలిపారు. జగన్ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా, తమ పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే తాను పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. అలాగే, షరతుల బెయిల్ పొందిన జగన్మోహన్... అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసేలా ఈ కేసుల్లోని నిందితులకు పలు పదవులు ఇచ్చారని కోర్టు దృష్టితీసుకెళ్లారు.