కంగేయం స్థానానికి 1000 మంది రైతుల నామినేషన్ల దాఖలు
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 1000 మంది రైతులు కంగేయం స్థానానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పరంబికుళం-అల్లియర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌ను నాయకులు పట్టించుకోకపోవడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే విషయంపై ఐదు రోజులు నిరాహార దీక్షలు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఇచ్చిన హామీతో రైతులు నిరాహార దీక్షను ముగించారు.
సీఎం హామీ.. హామీగానే మిగిలిపోయిందని తమ డిమాండ్లు నెరవేరలేదని రైతులు అంటున్నారు. అందుకే ఎన్నికల వేళ రైతు కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. కమిటీ సభ్యులు మంగళవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే 20కి పైగా నామినేషన్లు వేసినట్లు కమిటీ వర్గాలు తెలిపాయి.
ఈరోడ్ జిల్లాలోని మోడకురుచి అసెంబ్లీ సీటుపై రైతులు 25 సంవత్సరాల క్రితం ఇదే పనిచేశారు. 1996లో, 1,016 మంది రైతులు నామినేషన్ వేశారు, మొత్తం 1.033 మంది అభ్యర్థులు అప్పట్లో పోటీలో ఉన్నారు. ఇది ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. చివరికి అక్కడ ఎన్నికలు ఒక నెల వాయిదా పడాల్సి వచ్చింది. 50 పేజీల బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించారు. నిజామాబాద్‌లో కూడా పసుపు రైతులు 158మంది పార్లమెంట్‌కు పోటీ చేశారు.