శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (15:00 IST)

కులం తక్కువ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందనీ.. కొట్టి చంపిన తల్లితండ్రులు

తెలంగాణా రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. ప్రణయ్ పరువు హత్య మరువకముందే ఇదే తరహా హత్య జరిగింది. తెలుగు రాష్ట్రంలోనేకాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితులకు ఇప్పటివరకు బెయిల్ మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో మంచిర్యాలలో మరో  పరువు హత్య జరిగింది. 
 
ప్రేమ వివాహం చేసుకుందని కూతురిని తల్లిదండ్రులు కొట్టి చంపారు. జిల్లాలోని జన్నారం మండలం కలమడుగులో ఈ ఘోరం జరిగింది. కలమడుగుకు చెందిన అనురాధ, లక్ష్మణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ జంట పెద్దలను ఎదిరించి ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నారు. 
 
ఈ వివాహాన్ని అనురాధ తల్లిదండ్రులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. అనురాధ దంపతులను యువతి తల్లిదండ్రులు వెంబడిస్తూ వచ్చారు. కులం తక్కువోడిని పెళ్లి చేసుకున్నందుకు యువతి తల్లిదండ్రులు అనురాధను కొట్టి చంపేశారు. 
 
అదీ కూడా నవ దంపతులను ప్రేమతో ఇంటికి పిలిపించి... ఆ తర్వాత తమ కుమార్తెను పట్టుకుని చితకబాది చంపేశారు. ఆ తర్వాత కుమార్తె శవాన్ని తమ స్వంత పొలంలో సజీవ దహనం చేశారు. గ్రామస్థులు అందించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.