సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:40 IST)

భార్య గర్భం దాల్చిందని విడాకులు కోరిన భర్త..?

ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రెండేళ్ళు కాపురం చేశాడు. భార్య గర్భవతి అయ్యాక ప్లేటు ఫిరాయించాడు. భార్య తనతో కాపురానికి రాలేదని కుటుంబ పెద్దలకు చెప్పాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. భర్తకి ఫోన్ చేసి విసిగిపోయిన బాధితురాలు అత్తింటి ముందు ధర్నాకు దిగింది.
 
చిత్తూరు జిల్లా కుప్పం మండలం కత్తిమలిపల్లికి చెందిన వినోద్, వి.కోటకు చెందిన అనితను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చి పెళ్ళి చేసుకున్నాడు. రెండేళ్ళ పాటు కాపురం చేశాడు. ఈలోపు రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. మళ్ళీ గర్భం దాల్చడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు.
 
ఇంటి నుంచి వచ్చేశాడు. తనతో భార్య కాపురానికి రావడం లేదని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. విడాకుల నోటీసులు భార్యకు పంపాడు. దీంతో భార్య అనితకు ఏం చేయాలో పాలుపోలేదు. పెద్దలను తీసుకొచ్చి మాట్లాడింది. ఉపయోగం లేకుండా పోయింది. దీంతో తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. న్యాయం కావాలని కోరుతోంది. పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న వినోద్ పరారీలో ఉన్నాడు.