సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (10:45 IST)

శెనక్కాయల పేరుతో రూ.100 కోట్లు దండుకున్నాడు...

వేరుశెనక్కాయల పేరుతో రూ.100 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టారు. గొలుసు కట్టు పేరుతో ఓ కంపెనీ ఈ ఘరానా మోసానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గొలుసు కట్టు కంపెనీ ఒకటి హైదరాబాద్ నగరంలో తన మాయాజాలాన్ని ప్రదర్శించింది. రూ.లక్ష పెట్టుబడితో రూ.లక్షలు సంపాదించవచ్చంటూ ప్రజలను నమ్మించింది. రూ.లక్ష పెట్టుబడిపెట్టేవారు చేయాల్సిందంతా వేరుశెనగలను ఆడించి నూనె తీయడమే. ఇందుకు ఉపయోగపడే యంత్రాన్ని కూడా వారే ఇస్తారు. కంపెనీవారు కోరినపుడల్లా వేరుశెనగలను కాదనకుండా ఆడించి నూనె తీసి ఇవ్వాలి. ఇలా చేస్తే నెలకు రూ.20 వేల కమిషన్‌తో పాటు రెండేళ్లు తిరిగేసరికి రూ.4.80 లక్షలు చేతికి వస్తాయంటూ ప్రచారం చేశారు. 
 
అంటే పెట్టిన పెట్టుబడి పోగా రూ.3.80 లక్షలు వస్తాయన్నమాట. వేరుశెనగల ద్వారా తీసిన నూనెతో పాటు ఆ పిప్పిని కంపెనీకి చేరవేయాల్సి ఉంటుంది. ఈ గొలుసు కట్టు కంపెనీ ఏకంగా రూ.100 కోట్ల మేరకు ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది. ఈ కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాటల గారడీలో పడిపోయిన కొందరు ఏకంగా రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇలా వేలాది మంది రూ.లక్ష నుంచి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో రూ.100 కోట్ల మేరకు చేరాయి. 
 
ఈ మొత్తాన్ని తీసుకుని ఆ కంపెనీ ప్రతినిధులు జంప్ అయ్యారు. కంపెనీ పేరు గ్రీన్‌గోల్డ్ బయోటెక్. ఉప్పల్ కేంద్రంగా శ్రీకాంత్ అనే వ్యక్తి దీన్ని నడుపుతూ వచ్చాడు. చివరకు పెట్టుబడిదారులందరికీ కుచ్చుటోపీ పెట్టి రూ.100 కోట్లతో పరారయ్యాడు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ గొలుసుకట్టు మోసం వెలుగులోకి వచ్చింది.