సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జులై 2020 (13:37 IST)

బాలిక ఫోటోలు మార్ఫింగ్ చేసి.. ఆపై సోషల్ మీడియాలో వైరల్ చేశారు..

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు, హింసలు, ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కొందరు యువకులు ఓ బాలిక ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి.. ఆ బాలిక పేరు మీదనే నకిలీ ఫేస్ బుక్ ఖాతాను క్రియేట్ చేశారు.

మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా డబ్బులిస్తేనే వాటిని తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాలిక తండ్రి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బాలిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలిక ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. ఈ క్రమంలోనే జూన్ 27న సాయంత్రం వాట్సాప్‌లో మార్ఫింగ్ చేసిన బాలిక ఫొటోలను పంపించారు. బాలిక పేరుతోనే ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను తెరిచారు.
 
అందులో మార్ఫింగ్ ఫొటోలను పోస్టు చేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. బాలిక తండ్రి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలను తొలగించాలంటే డబ్బు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని.. బాలిక తండ్రి పోలీసులకు వెల్లడించారు.