శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (19:51 IST)

సొంత నానమ్మను పెట్రోల్ పోసి తగులబెట్టిన మనవడు..

పదో తరగతి చదువుతున్న కుర్రాడు.. ఆస్తి కోసం ఘాతుకానికి ఒడిగట్టాడు. సొంత నానమ్మను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో ఈ ఘోరం జరిగింది. ఎలవర్తి గ్రామానికి చెందిన ఓ బాలుడు స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఐతే ఇటీవల అతడి నానమ్మ కంసమ్మ.. తన ఆస్తిలోని కొంత భాగాన్ని కూతుళ్ల పేరిట రిజిస్టర్ చేయించింది. 
 
అప్పటి నుంచి నానమ్మపై ఆ బాలుడు పగ పెంచుకున్నాడు. తనకు రావాల్సిన ఆస్తిని మేనత్తలకు కట్టబెట్టడంపై ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే నానమ్మపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. 
 
తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంటి నుంచి మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. అప్పటికే ఇంటి గుమ్మం వద్ద కాలిపోయిన స్థితిలో కంసమ్మ మృతదేహం కనిపించింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నారు.