"ఒక్క రోజు ముఖ్యమంత్రి ఆఫర్"... మీరు సిద్ధమా? ఎక్కడ?
గతంలో ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఒకే ఒక్కడు". అర్జున్ హీరో కాగా, రఘువరన్ ప్రతి నాయకుడు. ఈ చిత్రంలో రఘువరన్ ఓ ముఖ్యమంత్రిగా ఉంటాడు. అపుడు ఆయన హీరో అర్జున్‌కు ఒక్క రోజు సీఎం ఆఫర్ ఇస్తాడు. ఈ ఆఫర్‌ను స్వీకరించి హీరో... ఒక్క రోజు సీఎంగా ఉంటాడు. ఆ ఒక్క రోజు సీఎంగా అర్జున్ చేసిన పనులకు ప్రజలు ఫిదా అయిపోతారు. ఇది 'ఒకే ఒక్కడు' చిత్ర కథ.
అయితే, ఇపుడు అచ్చం... 'ఒకే ఒక్కడు' చిత్ర కథను ఓ జిల్లా కలెక్టర్ గుర్తుకు తెస్తున్నాడు. ఆ కలెక్టర్ పేరు పోలా భాస్కర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కలెక్టర్. ఇపుడు ఈయన కూడా తన జిల్లా వాసులకు ఒకే ఒక్కడు సినిమా తరహాలో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. 'ఒకే ఒక్కడు' చిత్రంలో తరహాలో తన పదవిలో ఒక్కరోజు ఉండి చూడండి అంటూ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న జిల్లాల్లో ఒంగోలు ఒకటి. దీంతో ఆయన ఇటీవల జిల్లా వర్తకులతో ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, కరోనా కట్టడిలో తనకంటే మంచిగా పనిచేసే వ్యక్తి ఉంటే ఒక రోజు కలెక్టర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తానని ప్రజలకు పిలుపునిచ్చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను తాను అమలు చేస్తున్నానని చెబుతూ.. ఇలాంటి సమయంలో కలెక్టర్‌గా పనిచేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన ఇచ్చిన ఆఫర్‌పై సోషల్ మీడియాలో పలువురు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.