గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (08:57 IST)

అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు - ఏపీతో పోటీపడుతున్న ధనిక రాష్ట్రం!!

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకున్నాయి. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ కూడా ఇపుడు పీకల్లోతు అప్పుల్లో కూరుకునిపోయింది. గత 2018-19 తో పోలిస్తే గతేడాది తెలంగాణపై అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై 42 శాతం పెరిగింది. 
 
తెలంగాణ రాష్ట్రం ఈ యేడాది ఇప్పటివరకు తీసుకున్న దానిని బట్టి మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణం రూ.48 వేల కోట్లకు, నికర రుణం రూ.40,500 కోట్లకు చేరే అవకాశం ఉంది.
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన స్థూల రుణం 42.10 శాతం, నికర రుణం 42.47 శాతం పెరిగింది. 
 
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నెలకు సగటున రూ.3,333 కోట్ల చొప్పున రూ.10 వేల కోట్ల స్థూల రుణం తీసుకోగా, ఇందులో నికర రుణం వాటా రూ.8,250 కోట్లుగా ఉంది.
 
ఫలితంగా గతేడాది 9వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి ఆరోస్థానానికి ఎగబాకగా, ఆరో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏకంగా మూడో స్థానానికి చేరుకున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంకు సోమవారం విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 
 
గత ఆర్థిక సంవత్సరంలో రూ.67,453 కోట్ల స్థూల రుణం, రూ.50,494 కోట్ల నికర రుణంతో ఉత్తరప్రదేశ్‌ అప్పుల్లో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.