శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (08:17 IST)

ఆంధ్రాకు రావాలంటే ఇవి పాటించాల్సిందే : కొత్త క్వారంటైన్ రూల్స్...

కరోనా వైరస్ చాపకింద నీరులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులోభాగంగా, నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి విధించే క్వారంటైన్‌లో మార్పులు చేశారు. 
 
కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్ ప్రాంతాలుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చేవారికి ర్యాండమ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. 14 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి అని నిర్దేశించారు.
 
హైరిస్క్ జోన్లుగా ప్రకటించిన తెలంగాణ, కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా 14 రోజుల హోంక్వారంటైన్ అమలు చేస్తారు. ఇప్పటివరకు ఈ తరహా క్వారంటైన్ 7 రోజులుగా ఉంది. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేశారు. 
 
ఇక, విదేశాల నుంచి వచ్చేవారికి ఇకపై 7 రోజుల పాటు క్వారంటైన్ విధించనున్నారు. వారికి ఎయిర్ పోర్టుల్లోనే స్వాబ్ టెస్టు చేయాలని, క్వారంటైన్‌లో ఐదో రోజు, ఏడో రోజు కరోనా టెస్టులు చేయాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
 
ఇదిలావుంటే, ఏపీలో కరోనా బీభత్సం మరింత పెరిగింది. 24 గంటల వ్యవధిలో 37 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించినట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 365కి పెరిగింది. ఇక, కొత్తగా 1,935 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 313, కర్నూలు జిల్లాలో 249, శ్రీకాకుళం జిల్లాలో 204, గుంటూరు జిల్లాలో 191, అనంతపురం జిల్లాలో 176, చిత్తూరు జిల్లాలో 168, పశ్చిమ గోదావరి జిల్లాలో 137, కృష్ణా జిల్లాలో 111 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 31,103కి చేరింది. తాజాగా 1,030 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా, 14,274 మంది చికిత్స పొందుతున్నారు.