శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (12:49 IST)

పోలీసుల బండారాన్ని బయటపెట్టిన సీసీటీవీ ఫుటేజీలు

చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే. కానీ, హైదరాబాద్ నగర పోలీసులు మాత్రం పోలీసు, రాజకీయ నేతల వారసులకు మాత్రం ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్నారు. పోలీసు అధికారి, మాజీ ఎంపీ కుమారుడు తప్పు చేస్తే... వారిని వదిలివేసి ఓ నిందితుడుపై కేసు పెట్టారు. అయితే, పోలీసుల బండారాన్ని సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాయి. దీంతో ఏం చేయలేక వారిద్దరిపై కూడా కేసు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏసీపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ కలిసి రోడ్డుపైనే మద్యం తాగారు. మద్యం మత్తులో దారిన వచ్చే పోయే వారని అటకాయిస్తూ హల్‌చల్‌ సృష్టించారు. అగ్గిపెట్టె కావాలని ఓ యువకుడిని అడిగారు. లేదనడంతో దాడికి దిగారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 
 
అమీర్‌పేట సారథి స్టూడియోస్‌ వెనుకవైపు కీర్తి అపార్ట్‌మెంట్స్‌ దారిలో శనివారం అర్థరాత్రి 1.45 గంటలకు కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అశోక్‌ ఆ మార్గంలో ఇంటికెళ్తున్నాడు. వారు అతడిని ఆపి అగ్గిపెట్టె అడిగారు. లేదనడంతో కొట్టారు. బాధితుడు తప్పించుకుని ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. 
 
నిందితులు కూడా అక్కడికి వచ్చారు. తాము ఎవరో చెప్పడంతో పోలీసులు వారిని వదిలేశారు. పైగా బాధితుడిని ఫోన్‌ లాక్కుని సెల్‌‌లో పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ బాధితుడు పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నాడు. దాడి దృశ్యాలను స్థానిక సీసీ ఫూటేజీ ద్వారా సేకరించిన బాధితుడి స్నేహితులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏమీ చేయలేక నిందితులపై కేసు నమోదు చేశారు.