తిరుమలలో పరిశుభ్రత చర్యలు భేష్ : జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో కోవిడ్-19 నేపథ్యంలో పరిశుభ్రతా చర్యలు మెరుగ్గా ఉన్నాయని జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసించారు. శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. అనంతరం విఐపి బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల ఆరోగ్యభద్రతను దృష్టిలో ఉంచుకుని పటిష్టంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారని టిటిడి యంత్రాంగాన్ని కొనియాడారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.