నన్ను క్షమించండి, మీరు రావద్దండి, నేనొక్కణ్ణే సీఎం వద్దకు వెళ్తానండి: ముద్రగడ రివర్స్
కాపు ఉద్యమ నాయకుడు ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని స్థితి నెలకొన్నది. రెండురోజుల క్రితం తను భారీ ర్యాలీతో కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి వైసిపిలో చేరుతానని బహిరంగంగా ఓ లేఖ రాసారు. దానితోపాటుగా... తనతో ర్యాలీలో పాల్గొనేవారు ఎవరి ఆహారం వాళ్లు తెచ్చుకోవాలని కూడా స్పష్టం చేసారు. ఇంతలోనే రివర్స్ అయ్యారు. రేపు 14 మార్చి నాడు తను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతానని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మరో బహిరంగ లేఖ రాసారు. అందులో... తను ఊహించిన దానికంటే స్పందన ఎక్కువగా వున్నదనీ, భారీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చేట్లున్నారని, అందువల్ల వారంతా వస్తే సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నం కావచ్చని తెలిపారు. పైగా ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయాల్సి వుంటుందని, ఇదంతా చాలా టైం పట్టే విషయం కనుక భారీ ర్యాలీగా వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. మార్చి 15 లేదా 16న తను ఒక్కడినే వెళ్లి ముఖ్యమంత్రిగారి సమక్షంలో పార్టీలో చేరుతానంటూ తెలిపారు.