బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (15:36 IST)

అదే నిజమైతే జగన్ ను భగవంతుడు కూడా క్షమించడు: అయ్యన్నపాత్రుడు

రాజధానిని విశాఖకు మార్చేందుకు ప్రభుత్వం విశాఖ‌లో క‌రోనా ప్ర‌భావం పెద్ద‌గా లేద‌ని తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజలంతా భావిస్తున్నారని, అదే నిజమైతే భగవంతుడు క్షమించడంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు శాపనార్థ‌లు పెట్టారు.

ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆట‌లాడుతుంద‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జమెత్తారు. ప్ర‌భుత్వం వాస్తవాలు బ‌య‌ట‌కు చెప్పాలని కోరారు. ప్ర‌భుత్వాధికారులు సైతం వాస్త‌వాలు బ‌య‌ట‌పెట్టంలేద‌ని విమ‌ర్శించారు.

రోజు రోజుకు కరోనా కేసులు విశాఖ నగరంలో విపరీతంగా పెరుగుతున్నాయని ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని, కానీ ప్రభుత్వం, వైద్య సిబ్బంది విశాఖలో కేసులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నది వాస్త‌వం కాదా? కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇది నిజం అంటున్నారు.

స్వార్థ ప్రయోజనాల కోసం కరోనా వైర‌స్ వ్యాప్తి వివరాలు దాస్తే ఉత్తరంధ్ర జిల్లాల‌ ప్రజలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది' అని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.
 
రాష్టంలో కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం విశాఖ‌లో లేద‌ని ప్ర‌జ‌లను మోసం చేయడం సరికాదన్నారు. నిజాలు దాయ‌డం ప్ర‌జ‌లకు తీవ్ర ప్రాణాల‌కు ముప్పు అని హెచ్చ‌రించారు.

కరోనాపై అస‌లు లెక్క‌లు చెప్పి బులిటెన్ విడుదల చేయాలని అయ్యన్నపాత్రుడు కోరారు. లాక్ డౌన్ వల్ల పేదలు, కూలీలు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల గురించి ఆలోచించాలని, ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. వైసీపీ నాయ‌కులు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు చూడ‌టం స‌రికాద‌న్నారు.