వరకట్నంగా ఉచిత వైద్యం... ఇది ఓ సబ్ కలెక్టర్ కోరిక...
ఆయనో ఐఏఎస్ అధికారి. సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఓ వైద్యురాలితో వివాహం నిశ్చియమైంది. ఇద్దరూ విద్యావంతులు. అయినప్పటికీ.. వారిమధ్య వరకట్న ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో సబ్ కలెక్టర్ కోరిక విన్న వధువుతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇతకీ ఆ సబ్ కలెక్టర్ వరకట్నంగా వారంలో రెండు రోజుల పాటు.. ఉచిత వైద్యం చేయాలని కాబోయే భార్యకు కండిషన్ పెట్టారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారి అవాక్కయ్యారు. ఆ తర్వాత ఈ కండీషన్‌కు కాబోయే భార్య సమ్మతించడంతో వారిద్దరి వివాహం సాఫీగా సాగిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
తమిళనాడు రాష్ట్రంలోని ఒట్టంకాడు గ్రామానికి చెందిన ప్రభాకరన్ ఓ సబ్ కలెక్టర్. ఈయనకు కృష్ణ భారతి అనే వైద్యురాలితో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే, వరకట్నంగా వారంలో రెండు రోజుల పాటు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని, అదే తనకిచ్చే కట్నమని చెప్పాడు. అది కూడా తన స్వగ్రామమైన ఒట్టంకాడు, దాని పరిసర గ్రామాల్లోనే చేయాలని సూచించాడు. దీనికి ఆమె, ఆమె తల్లిదండ్రులూ అంగీకరించారు.
ప్రభాకరన్ తల్లిదండ్రులు కూలీలు కాగా, తన ప్రతిభతో తొలుత రైల్వే శాఖలో ఉద్యోగం సాధించిన ఆయన, ఆపై పట్టుదల చూపి ఐఏఎస్ సాధించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో పలు రకాల సేవలనూ అందిస్తున్నారు. వీరి ఆదర్శ వివాహానికి ఇప్పుడు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.