మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (10:41 IST)

అరబ్ షేక్ వికృత చేష్టలు... యువతిని గదిలో బంధించి...

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ అరబ్ షేక్ వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఓ యువతిని గదిలో బంధించిన అరబ్ షేక్.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిఖా పేరుతో అరబ్ షేక్ ఐదు రోజుల పాటు గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దారుణం చాంద్రాయణ గుట్టలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అంబర్‌పేట్‌ తురాబ్‌నగర్‌లో నివసించే ఫాతిమా ఉన్నిసాకు కొత్తపేట నబీల్‌ కాలనీలో ఓ ఇల్లు ఉంది. గత కొన్ని రోజులుగా ఈ ఇల్లును విక్రయిస్తానని ఫాతీమా ఉన్నిసా బ్రోకర్లకు తెలిపింది. దీంతో దళారీ మహ్మద్‌ సాబెర్‌ అలియాస్‌ వోల్టా సాబెర్‌ ఫిబ్రవరి 25వ తేదీన ఫాతీమా ఉన్నిసాకు ఫోన్‌ చేసి కొత్తపేట్‌ నబీల్‌ కాలనీలోని మీ ఇంటిని కొనుగోలు చేయడానికి పార్టీ సిద్ధంగా ఉందని తెలిపాడు.
 
దీంతో, ఇల్లు చూపించేందుకు ఫాతీమా ఉన్నిసా చెల్లెలు రఫత్‌ ఉన్నిసా (25)తో కలిసి వెళ్లింది. వీరు అక్కడికి వెళ్లే లోపే దళారీ మహ్మద్‌ సాబెర్‌ అతడి భార్య సమీనాతో పాటు అరబ్‌ షేక్‌ ఇబ్రహీం (60)కి వచ్చివున్నాడు. నీవు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని అరబ్‌ షేక్‌ ముందుగా అక్క ఫాతీమా ఉన్నిసాకు ఆఫర్‌ చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చెల్లెలు రఫత్‌ ఉన్నిసాకు ఆఫర్‌ చేశాడు. అక్కా చెల్లెలు ఇద్దరు అభ్యతరం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
వీరు వెళ్లిపోయిన తర్వాత దళారీ మహ్మద్‌ సాబెర్‌ అతని భార్య సమీనా... రఫత్‌ ఉన్నిసాను మీకు ఏలాగానై అప్పగిస్తామని షేక్‌కు మాట ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మహ్మద్‌ సాబెర్‌ భార్య సమీనా అంబర్‌పేట్‌ తురాబ్‌నగర్‌కు వెళ్లి మా ఇంటికి రావాలంటూ రఫత్‌ను ఆహ్వానించింది. 
 
సమీనా మాట కాదనలేక రఫత్‌ వారి ఇంటికి ఒక్కతే వెళ్లింది. అప్పటికే ఆ ఇంట్లో ఓ గదిలో షేక్‌ ఉన్నాడు. ఐదు రోజులుగా యువతిని ఆ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. చెల్లెలు అదృశ్యం కావడంతో ఆందోళనలో ఉన్న ఫాతీమా ఉన్నిసాకు దళారీ మహ్మద్‌ సాబెర్‌పై అనుమానం వచ్చి, సమీనాను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రఫత్‌ను బంధించిన ఇంటికి వెళ్లారు. అప్పటికే రఫత్‌ను చిత్రహింసలకు గురిచేసిన షేక్‌ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ఇబ్రహీం షేక్‌తో పాటు దళారీ మహ్మద్‌ సాబెర్‌, అతడి భార్య సమీనా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.