1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (10:50 IST)

వాటిని అమలు చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మళ్లీ పూర్వవైభవం

దేశంలో ఏ స్టీల్ ప్లాంట్‌కు లేని ప్రత్యేకత విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉందని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖే అని ఆయన తెలిపారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎగుమతి, దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనన్నారు. స్లీట్ ప్లాంట్‌పై ప్రధాని మోదీకి లేఖ రాశామన్నారు. కొన్ని ప్రధానమైన సూచనలు చేశామని.. వాటిని అమలు చేస్తే మళ్లీ పూర్వవైభవం తీసుకురావచ్చని తెలిపారు.

రానున్న కాలంలో స్టీల్‌కు డిమాండ్ పెరగనుందని.. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో దేశానిది రెండో స్థానమన్న ఆయన..  స్టీల్ పరిశ్రమలను ప్రయివేటీకరిస్తే... సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందన్నారు.

ధరలన్నీ కంపెనీ వాళ్ల చేతుల్లో ఉంటాయని హెచ్చరించారు. రేపటి రోజున స్టీల్ కొనడం కష్టంగా మారుతుందన్నారు. సర్దార్ పటేల్ విగ్రమానికి 3200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2200 టన్నులను విశాఖ నుంచే పంపారన్నారు.

మిగిలిన స్టీల్ కంటే ఇది నాణ్యమైనదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వెనక అనేకమంది ప్రాణత్యాగాలున్నాయన్నారు. తమ చిన్నప్పుడు విశాఖ పోరాటం గురించి చర్చించుకుంటుంటే విన్నామని తెలిపారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల గుండె చప్పుడన్నారు. టీమ్ ఇండియా క్రికెట్‌లో గెలిస్తే దేశం గెలిచిందని సంబురాలు చేసుకుంటామని.. అలాగే స్టీల్ కేంద్రం చేతుల్లో ఉంటే మనందరికీ గర్వకారణమన్నారు.