బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:25 IST)

పెరిగిన దుర్గమ్మ హుండీ ఆదాయం

కృష్ణా జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని  ఆలయ అధికారులు లెక్కించారు . సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రి పైన మహామండపం 6 వ ఫ్లోర్ లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు నిర్వహించారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు  కనుగుల వెంకటరమణ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు బ్యాంకు సిబ్బంది పర్యవేక్షించారు.
 
గడచిన ఆరు రోజులకు మొత్తం 36 హుండీలను లెక్కించగా రూ. 1,06,84,953 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ చెప్పారు.
 
హుండీల ద్వారా  30 గ్రాముల బంగారం, 2 కేజీల 438 గ్రాముల వెండి అమ్మవారికి భ‌క్తులు కానుక‌ల రూపంలో శ్రీ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. గడచిన 6 రోజులలో సగటున రోజుకు రూ.17.80 లక్షల చొప్పున దేవస్థానానికి హుండీల ద్వారా ఆదాయం చేకూరింది.

ఈ నెల 7వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఆలయ హుండీ లెక్కింపుని నిర్వహించారు. మరోవైపు ఇంద్ర కీలాద్రి దసర నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది.