గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (12:03 IST)

చిక్కుల్లో మాజీ మంత్రి పేర్ని నాని.. క్రిమినల్ చర్యలకు సర్కారు సిద్ధం

perni nani
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయన భార్యపై ఇప్పటికే కేసు నమోదైంది. తాజాగా పేర్ని నానిపై కూడా క్రిమిలన్ చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదైంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్‌లో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మనీర్ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
మాజీ మంత్రి నాని రూ.1.80 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మచిలీపట్నంలో నానికి చెందిన 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గోడౌను గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకుని అందులో బియ్యాన్ని నిల్వవుంచారు. అయితే, తన గోడౌన్‌లో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని, దాదాపు 3,200 బస్తాల తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమంటూ గత నెల పేర్ని నాని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబరు, 28,29 తేదీల్లో తనిఖీలు నిర్వహించగా, 3,700 బస్తాల (185 టన్నుల) బియ్యం తగ్గాయని గుర్తించారు. 
 
దీనిపై ఏమి చర్యలు తీసుకోవాలో తెలియజేయాలంటూ పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం రూ.48,500 చొప్పున గల్లంతైన బియ్యం విలువ రూ.89.72 లక్షలు, దీనికి రెట్టింపు జరిమానా వసూలు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు వెల్లడించారు.