ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (13:44 IST)

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం: విజయవాడ కొత్త సీపీ

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన బత్తిన శ్రీనివాసులు పేర్కొన్నారు.
 
విజయవాడ పోలీసు కమిషనరుగా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బత్తిన శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఇంతవరకు సీపీగా వ్యవహరించిన సీహెచ్ ద్వారకాతిరుమలరావు రైల్వే పోలీస్ డైరక్టర్ జనరల్ గా బదిలీ అయిన సంగతి తెలిసిందే.

సీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బి.శ్రీనివాసులు మాట్లాడుతూ... 
గత నాలుగు నెలలుగా నగరంలో అదనపు సీపీగా పనిచేస్తున్నానని, ఇక్కడ గతంలో 15 నెలలు సీపీగా, అంతకుముందు పశ్చిమ జోన్ ఏసీపీగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు.

పోలీసులు ప్రజలకు మరింత చేరువవ్వాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా, మరింత బాధ్యతాయుతంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ ను పటిష్టం చేసి శాంతిభద్రతలను పరిరక్షిస్తామని తెలిపారు. బేసిక్ పోలీసింగ్ ను మెరుగుపరచడనే తన ప్రధమ ప్రాధాన్యతగా బత్తిన చెప్పుకొచ్చారు.

కమిషనరేట్ పరిధిలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగివుండాలని, సైబర్ సెల్ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలు మోసగాళ్ల బారినపడకుండా ప్రభావవంతంగా పనిచేస్తోందని అన్నారు.

రోడ్లు తదితర మౌలిక వసతులు మెరుగుపడితేనే ట్రాఫిక్ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని విశ్లేషించారు. బత్తిన శ్రీనివాసులుకు సీపీగా బాధ్యతలు అందించిన సందర్భంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్.ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ.. నగరంలో 23 నెలల పాటు పనిచేశానని, సాధారణ ఎన్నికల నిర్వహణ, స్థానిక ఎన్నికల ప్రక్రియ, కోవిడ్ 19 విపత్తులలో సమర్ధవంతంగా పనిచేసామని అన్నారు.

పలు అంశాలలో ప్రయోగాత్మకంగా పనిచేసామని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సంబంధాల నిర్వహణలలో మెరుగైన ఫలితాలు సాధించామని వెల్లడించారు. నగర కమిషరుగా పూర్తి సంతృప్తితో బాధ్యతలు నిర్వర్తించానని చెప్పిన ద్వారకాతిరుమలరావు, నగర కమిషనరుగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న శ్రీనివాసులుకు శుభాకాంక్షలు తెలియజేశారు.