శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 24 జులై 2021 (22:02 IST)

పాపం అనిల్, వెల్లంపల్లి పదవుల పనైపోయిందా?

వైసిపి ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు దగ్గర పడుతోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా మొదట్లో ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి రెండున్నర సంవత్సరాలకే మంత్రులను మార్చేస్తానన్నారు. పనితీరును బట్టి మంత్రులను ఉంచాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 
 
జగన్ చెప్పినట్లుగా రెండున్నరేళ్ళు కావస్తోంది. దీంతో ఇప్పటికే చాలామంది మంత్రులు అసలు తిరిగి తమకు పదవులు వస్తాయా లేదా అన్న అనుమానంతో ఉన్నారు. మంత్రి పదవులు పోతే పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ఇంకొంతమంది ఉన్నారు. తమకు కేటాయించిన శాఖల్లో బాగా పనిచేశామని మరికొంతమంది భావిస్తున్నారు.
 
అయితే టిడిపిని బాగా తిడుతూ చంద్రబాబును టార్గెట్ చేసే వారికి జగన్ దగ్గర వందకు వంద మార్కులు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. అందులో మొదటి వ్యక్తి కొడాలి నాని, రెండవ వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు వీరిద్దరిలో ఒకరికి పదవి పోవడం ఖాయమన్న ప్రచారం బాగానే సాగుతోంది.
 
వీరే కాదు ఏకంగా దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పదవి కూడా పోవడం ఖాయమంటున్నారు. తమకు కేటాయించిన శాఖలను సక్రమంగా నిర్వర్తించకపోవడమే అందుకు కారణమంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా మంత్రి పదవి నుంచి తొలగిస్తారని.. అందుకే పోలవరం సందర్సనలో అనిల్ అంటీముట్టనట్లు సిఎం పర్యటనలో ఉన్నారన్న ప్రచారం బాగానే సాగుతోంది. మరి వాస్తవం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.