ఖాళీ బాటిళ్ళలో పెట్రోల్ పోస్తే కఠిన చర్యలు : పోలీసులు
ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ పోసే బంకుల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ.. జోన్ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులను జారీ చేస్తున్నామన్నారు.
అంతేకాకుండా ఖాళీ బాటిళ్లతో వచ్చే వారి పేరు, ఫోన్ నంబరు, వాహనం నంబర్లు పెట్రోలు బంక్ సిబ్బంది సేకరించుకోవాలన్నారు. పెట్రోలు బంక్ సిబ్బంది వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఖాళీ బాటిళ్లతో పెట్రోలు కోసం వచ్చే వారి ఫోటోను తీసుకుని పెట్టుకోవాలని తెలిపారు.
ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు దృష్ట్యా ఈ విషయాలను ప్రతి పెట్రోలు బంక్ సిబ్బంది, యాజమాన్యం పాటించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై బంక్ యజమానులు, నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోయవద్దని తెలియజేస్తామని ఆయన తెలిపారు.