పెట్రోల్ రేటును మించిపోయిన పాల ధర.. లీటరు పాలు రూ.140.. ఎక్కడ?
పాకిస్థాన్ ఆర్థికసంక్షోభంలో కూరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని నిజం చేసేలా ఇపుడు ఆ దేశంలో లీటరు పాల ధర లీటరు పెట్రోల్ కంటే పెరిగిపోయింది. పాకిస్థాన్‌లో లీటరు పెట్రోలు ధర రూ.113గా ఉండగా, డీజిల్ ధర రూ.91గా ఉంది. కానీ, లీటరు పాల ధర రూ.140కు చేరుకుంది. దీంతో జనం గగ్గోలుపెడుతున్నారు.
నిజానికి లీటరు పాల ధర రూ.50 నుంచి రూ.60కి మించదు. కానీ, ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, కరాచి లాంటి నగరాల్లో పాల ధర పెట్రోల్, డీజిల్ ధరలను మించిపోయింది. మంగళవారం మొహర్రం సందర్భంగా పాక్‌లో లీటర్ పాల ధర 120-140 రూపాయలు వరకు పలికింది.
సాధారణంగా మొహర్రం రోజున పాల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే డిమాండ్ ఆ విధంగా ఉంటుంది. కానీ, ఈ తీరుగా పెరగడం ఇదే ప్రథమమని స్థానికులు అంటున్నారు. పవిత్ర మొహర్రం సందర్భంగా ముస్లింలు పాలతో వివిధ రకాలైన పానియాలు(షరబత్ లాంటివి), వంటకాలు తయారు చేసి ప్రజలకు పంచుతారు. దీంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.