గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (22:11 IST)

‘పాకిస్తాన్‌లో మైనార్టీలకు రక్షణ లేదు.. భారత్‌లో ఉంటా ఆశ్రయం ఇవ్వండి’ - ఇమ్రాన్ ఖాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థన

పాకిస్తాన్ అధికార పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు బల్‌దేవ్ కుమార్ తనకు రాజకీయ పునరావాసం కల్పించాలని భారత్‌ను అభ్యర్థించారు. ప్రస్తుతం ఆయన భారతదేశంలోనే ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తరఫున ఆయన గతంలో ఖైబర్ పక్తుంఖ్వా అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు.

 
తన నిర్ణయం గురించి బల్‌దేవ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు. పాకిస్తాన్‌లో మైనార్టీలకు భద్రత లేదని, మతపరంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాలని తాను కోరుకోవడం లేదని, అందుకే రాజకీయ ఆశ్రయం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరానని ఆయన వివరించారు.

 
‘‘మైనార్టీలే కాదు, ముస్లింలకు కూడా పాకిస్తాన్‌లో రక్షణ లేదు. చాలా ఇబ్బందుల మధ్య అక్కడ బతుకుతున్నాం. నేను వెనక్కి వెళ్లను. భారత్‌ ఆశ్రయం ఇవ్వాలి’’ అని బల్‌దేవ్ అన్నారు. బల్‌దేవ్ సోదరుడు తాలిక్ కుమార్ ఖైబర్ పక్తుంఖ్వాలోని స్వాత్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆయనతోనూ బీబీసీ మాట్లాడింది. బల్‌దేవ్ రాజకీయ పునరావాసం కోసం భారత్‌ను అభ్యర్థించినట్లు తాను మీడియా ద్వారానే తెలుసుకున్నానని తాలిక్ బీబీసీతో అన్నారు.

 
బల్‌దేవ్ కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతోందని, ఆమెకు వైద్య చికిత్స చేయించేందుకు భార్య, పిల్లలతో సహా ఆయన భారత్‌కు వెళ్లారని తాలిక్ చెప్పారు. బల్‌దేవ్ సొంత పట్టణాన్ని వదులుకోవాలని పొరుగు దేశంలో పునరావసం కోరుకోవడం తనకు బాధ కలిగించిందని తాలిక్ అన్నారు. ''మా మొత్తం కుటుంబం పాకిస్తాన్‌లోనే ఉంటుంది. ఇదే మా దేశం. బల్‌దేవ్ కూడా ఇక్కడే పుట్టాడు. మాకు ఎప్పుడూ ఏ సమస్యా లేదు. బల్‌దేవ్ నిర్ణయం గురించి విని మా అన్న తీవ్రంగా బాధపడ్డారు'' అని తాలిక్ వివరించారు.

 
బల్‌దేవ్ కుమార్‌ను గతంలోనే సస్పెండ్ చేశామని, ఆయన తమ పార్టీలో సభ్యుడిగా లేరని ఖైబర్ పక్తుంఖ్వా సమాచారశాఖ మంత్రి, పీటీఐ నాయకుడు షౌకత్ యూసుఫ్‌జాయ్ తెలిపారు. తమ పార్టీ మైనార్టీ నాయకుడు సోరన్ సింగ్ హత్య వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు బల్‌దేవ్‌పై ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2016లో సోరన్ సింగ్ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి నమోదైన కేసులో బల్‌దేవ్ సహా ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు. వారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. 'యాంటీ-టెర్రరిజం కోర్టు' ఈ కేసు విచారణను చేపట్టింది.

 
రెండేళ్ల తర్వాత బల్‌దేవ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టు ఆయన్ను విడుదల చేసింది. పీటీఐ మైనార్టీ నాయకుల్లో సోరన్ సింగ్ తర్వాత స్థానంలో బల్‌దేవ్ కుమార్ ఉండేవారు. సోరన్ హత్య తర్వాత ఖైబర్ పక్తుంఖ్వా అసెంబ్లీ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. కానీ, పీటీఐ బల్‌దేవ్‌కు మద్దతుగా నిలవలేదు. పార్లమెంటులో ఆయన ప్రమాణ స్వీకారన్ని అడ్డుకుంది. దీంతో, బల్‌దేవ్ కోర్టును ఆశ్రయించి ప్రమాణ స్వీకారం కోసం అనుమతి తెచ్చుకున్నారు.

 
అయితే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే అసెంబ్లీ పదవీకాలం తీరిపోయింది. దీంతో ఎమ్మెల్యే పదవిలో ఆయన పూర్తిగా ఒక రోజైనా ఉండలేకపోయారు. బల్‌దేవ్ తల్లి, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులంతా స్వాత్‌లోని బారి కోట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన భార్య భారతీయురాలు. బల్‌దేవ్‌పై హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని సోరన్ సింగ్ అల్లుడు అజయ్ శరణ్ సింగ్ బీబీసీతో చెప్పారు.

 
హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి విదేశీ వీసా ఎలా వచ్చిందంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''సోరన్ సింగ్ హత్య తర్వాత పార్టీ బల్‌దేవ్‌ను పక్కనపెట్టింది. అందుకే, ఆయన ప్రమాణ స్వీకారాన్ని పార్టీ చాలా సార్లు అడ్డుకుంది. ఆయన్ను విశ్వసించే ముందు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి'' అని పీటీఐ నాయకుడు ఉమర్ చీమా అన్నారు.