శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (16:43 IST)

కేంద్రం మొండిచేయి చూపినా... వైజాగ్ మెట్రో రైల్ రాబోతోంది...

ఎట్టకేలకు విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు దక్షిణ కొరియాకి చెందిన కొన్ని సంస్థలు ముందుకువచ్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించబడ్డాయి. రూ.8 వేల కోట్లు అవసరం అవుతాయనే అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందించబడింది. 
 
ముందుగా ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలని భావించగా కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ద్వారా 50 శాతం నిధులు పెట్టి, మిగిలిన 50 శాతం నిధులను పీపీపీ విధానంలో సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలువగా ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన టాటా, అదాని, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ తదితర సంస్థలు అర్హత సాధించాయి. ఈ ప్రాజెక్టు పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి 1వ ప్యాకేజీలో సివిల్‌ పనులన్నింటినీ పూర్తి చేయనున్నారు.
 
అలాగే రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించి అందజేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ చూసుకుంటుంది. 2వ ప్యాకేజీలో రైలు ట్రాక్‌ నిర్మాణం, సిగ్నలింగ్‌ వ్యవస్థ, జీపీఎస్‌ ఏర్పాటు, ఇతర మెకానికల్‌ పనులను ప్రైవేటు సంస్థ చేపట్టనుంది. ఈ రెండో దశ పనులను చేపట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4 వేల కోట్ల నిధుల కోసం విశాఖపట్టణంలోని ప్రభుత్వ భూములను బ్యాంకులకు తనఖా పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు త్వరలో కార్యాచరణ చేపట్టే అవకాశం కూడా ఉంది.