బినామీ ఇంట్లో ఉంటున్న జగన్ నేరస్తుడు కాడా?: టీడీపీ

jagan house
ఎం| Last Updated: ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:08 IST)
రాష్ట్ర సంపద సృష్టి కేంద్రమైన అమరావతిపై వైసీపీ ప్రభుత్వం ప్రతిరోజూ విషం కక్కుతూనేఉందని, ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే కల్పతరువు లాంటి నగరాన్ని నాశనం చేసేందుకు జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, దానిలో భాగంగానే రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ కొత్త దుష్ప్రచారం మొదలుపెట్టిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై ముఖ్యమంత్రికి ఎంతప్రేముందో, ఆయన మనస్తత్వం ఏమిటో, 300రోజులుగా ఆందోళనచేస్తున్న అమరావతి రైతులను పట్టించుకోని ఆయన ఫ్యాక్షన్ ధోరణితోనే అర్థమవుతోందని నిమ్మల తెలిపారు.


అమరావతి పేరు పలకడానికే ముఖ్యమంత్రికి మనస్సు రావడం లేదన్న రామానాయుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిని సమర్థించిన జగన్ , ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటనతో ప్రజలను నమ్మించి
వెన్నుపోటు పొడిచాడన్నారు.


జగన్ రాజధానిలో ఇల్లుకట్టుకున్నాడని, భవిష్యత్ లో రాజధానిని అభివృద్ధి చేసే
నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని చెప్పిన వైసీపీనేతలంతా నేడు, జగన్ చేసిన మూడురాజధానులప్రకటనను సమర్థించడంద్వారా, ప్రజలకు నమ్మకద్రోహం చేయలేదా అని టీడీపీ ఎమ్మెల్యే నిలదీశారు.
అధికారంలోకి రాగానే మూడు రాజధానులప్రకటనతో రాష్ట్ర ప్రజలను వంచించిన వైసీపీప్రభుత్వం అమరావతికేంద్రంగా విషప్రచారం చేస్తూనేఉందన్నారు.

తొలుత ముంపుప్రాంతమని జగన్ ప్రభుత్వం విషప్రచారం చేస్తే, ఎన్జీటీ సంస్థ ఆ వాదనను కొట్టపడేసిందన్నారు. తరువాత రాజధానిఏరియా నివాసాలకు పనికిరాదని చెప్పారని, దాన్ని చెన్నైకి చెందిన ఐఐఐటీ సంస్థ పంటాపంచలు చేసిందన్నారు.
తదనంతరం వర్గాలపేరుతో కుట్రరాజకీయాలకు తెరలేపిన జగన్ ప్రభుత్వం, రాజధాని ప్రాంతమంతా
ఒకేసామాజికవర్గం చెప్పుచేతుల్లో ఉందని చెప్పడం జరిగిందన్నారు.

దానిలో వాస్తవం లేదని అమరావతి దళితుల ప్రాంతమని, 75శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలే అక్కడ ఉన్నారని,
రాజధాని చుట్టూ ఉన్న నియోజకవర్గాలన్నీ దళితులకు కేటాయించపబడినవేనని చెప్పడంతో వైసీపీ నేతలు తోకముడవడం జరిగిందన్నారు.


చివరకు రాజధాని
నిర్మాణానికి లక్షకోట్లు కావాలంటూ కొత్తనాటకాలు మొదలుపెట్టారని, రాజధాని కోసం రాష్ట్రం కాదు, రాష్ట్రం కోసమే రాజధాని అని,
ఆధారాలతో సహా ఆ వాదనను తొక్కేయడంతో, ఆదినుంచీ చేసిన ప్రచారాలన్నీ అవాస్తవాలేనని తేలడంతో వైసీపీ ప్రభుత్వం తోకముడిచిందన్నారు.
చివరకు దిక్కుతోచని స్థితిలోపడిన అవినీతి ప్రభుత్వం, ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ కొత్త రాగం మొదలెట్టిందని నిమ్మల మండిపడ్డారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుడు కథనాలతో ప్రచురించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంలో 4069ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ హాయాంలో రాష్ట్రంలో రూ.6లక్షలకోట్ల అవినీతి జరిగిందంటూ, ఏపీ ప్రజల మనస్సుల్లో విషబీజాలు నాటాలని చూసిందన్నారు. అధికారంలోకి వచ్చాక దాన్ని నిరూపించాలని టీడీపీ సవాల్ చేస్తే, ఇప్పటివరకు స్పందన లేదన్నారు.


రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ, రాజధాని ప్రకటన వచ్చేదాకా, ఆప్రాంతంలో జరిగిన భూలావాదేవీలు కేవలం 127 ఎకరాలు మాత్రమేనన్న నిమ్మల, వైసీపీ చెప్పిన 406 9ఎకరాలు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. నక్కకు, నాగలోకానికి ముడిపెట్టేలా అబద్ధపు ప్రచారం చేయడంలో వైసీపీని మించినవారు లేరన్నారు.

మాజీ మంత్రి నారాయణ 3,129 ఎకరాలు కొన్నాడని వైసీపీ వేయించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంలో చెప్పి, అధికారంలోకి వచ్చాక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అసెంబ్లీలో మాట్లాడుతూ, 55 ఎకరాలని చెప్పారన్నారు. చివరకు ఆధారాలు చూపమంటూ నారాయణ కోర్టుకెళ్లి, పరువునష్టం దావా వేయడంతో ఒక్క ఎకరా కూడా లేదంటూ, జగన్ ఆయన బృందం తేలుకుట్టిన దొంగల్లా
జారుకోవడం జరిగిందన్నారు.

వాస్తవంగా చూస్తే, రాజధానిప్రాంతంలో నారాయణకు, ఆయన కుటుంబానికి ఎక్కడా సెంటు భూమి కూడా లేదన్నారు. అదేవిధంగా ఎన్ ఆర్ ఐ అయిన వేమూరి రవికుమార్ లోకేశ్ బినామీ అని, ఆయనకు 500 ఎకరాలుందని ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంలో చెప్పిన వైసీపీనేతలు, అసెంబ్లీ లెక్కలకు
వచ్చే సరికి 25ఎకరాలకు దిగిపోయారన్నారు.


ఎక్కడో రాజధానికి వెలుపల, రాజధాని ప్రకటనరాకముందే ఆయన పది ఎకరాలుకొంటే, దాన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ప్రచారం చేశారని నిమ్మల తెలిపారు. వాస్తవానికి రవికుమార్ రాజధానిప్రకటన రావడానికి ముందే, 2004లో 16 ఎకరాలు కొంటే,
దానిలో పది ఎకరాలు రాజధాని పరిధికి వెలుపలే ఉందన్నారు. వైద్యవృత్తిలో ఉండి, వ్యాపారాలు నిర్వహించే రవికుమార్ కు లోకేశ్ బినామీ అని చెప్పడం సిగ్గుచేటన్నారు.

అదేవిధంగా
టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణ వియ్యంకుడైన రామారావుపై కూడా దుష్ప్రచారం చేశారని,
ఆయనకు చెందిన ఫర్టిలైజర్
సంస్థకు కిరణ్ కుమార్ ప్రభుత్వం 499ఎకరాల భూమిని, ఎకరానికి రూ.లక్షచొప్పున చెల్లించేలా, లీజుప్రాతిపదికన 2013లో కేటాయిస్తే, దాన్ని వారు కొన్నట్టుగా వైసీపీ పెయిడ్ బ్యాచ్ ప్రచారం చేసిందన్నారు.


2014లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే సదరు భూమికి, గత ప్రభుత్వం నిర్ణయించిన ధరను కాదని ఎకరం రూ.13లక్షలుగా నిర్ధారించడంతో,
ఆ భూమి తమకు వద్దని
రామారావు కంపెనీ వెనక్కు ఇచ్చిందన్నారు. సదరు భూమి ఇప్పటికీ ఏపీ ప్రభుత్వ అధీనంలోనే ఉందని, దాన్ని కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కిందచూపడం దిక్కుమాలిన జగన్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.

ఇదేవిధంగా ప్రత్తిపాటి పుల్లారావుకి 196 ఎకరాలుందని, ధూళిపాళ్ల నరేంద్రకు 3ఎకరాలని, పయ్యావుల కేశవ్ కు 4ఎకరాల భూములున్నాయని దుష్ర్పచారం చేశారన్నారు. నరేంద్ర, పయ్యావుల కేశవ్ తాము రాజధాని ప్రకటన వచ్చాకే భూమి కొన్నామని చెప్పడం జరిగిందన్నారు.
వారు చేసింది తప్పయితే, రాజధాని ప్రకటన తర్వాత రాజధానిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన జగన్ కూడా నేరస్తుడేనా అని టీడీపీనేత నిలదీశారు.

హెరిటేజ్ సంస్థ అన్ని రాష్ట్రాల మాదిరే, ఏపీలో కూడా తమ వ్యాపార విస్తరణకోసం, రాజధానికి వెలుపల 9.65ఎకరాలు కొనుగోలు చేసిందని,
అలానే అనంతపురంలో, నెల్లూరు, విశాఖపట్నాలలో కూడా కొనడం జరిగిందని, దాన్ని కూడా రాజధాని భూముల్లో చూపారని నిమ్మల తెలిపారు. ఒక వ్యాపారసంస్థ రాష్ట్రంలో భూమి కొంటే, అది ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా అవుతుందో ప్రభుత్వం చెప్పాలన్నారు.


ఈ విధంగా కానివీ, లేనివీ అన్ని రాజధానిభూముల్లో చూపి, అవన్నీ చంద్రబాబే తనవాళ్లకు కట్టబెట్టాడని ప్రజల చెవుల్లో
జోరీగల్లా వైసీపీనేతలు పోరుపెడుతూనే ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరగని దాన్ని జరిగినట్లుగా చెబుతూ, తప్పుడు ప్రచారంతో పుస్తకాలు వేయించిన వైసీపీనేతలు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న భూమాఫియాపై ఏం సమాధానం చెబుతారని నిమ్మల నిలదీశారు.

జగన్ తాడేపల్లిలో
ఉంటున్న ఇంటిస్థలం కూడా రాజధాని ప్రకటన తరువాతే కొన్నారన్న నిమ్మల,
అలా కొనడంనేరమైతే, జగన్ ని కూడా
వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. రాజధాని ప్రకటనకు ముందే తమ నాయకుడు రాజధానిలో ఇల్లుకట్టుకున్నాడని చెప్పినవారంతా, ఆ ఇల్లు ఎవరిపేరున ఉందో తెలుసుకోవాలన్నారు.

జగన్ ఉంటున్న తాడేపల్లి ఇల్లు రమేశ్ బాబు అనేవ్యక్తి పేరుతో ఉందని,
ఆయన జగన్ కు చెందిన 25 కంపెనీల్లో బినామీగా ఉన్నాడని రామానాయుడు స్పష్టంచేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ ప్రభుత్వం బినామీగా మారిపోయిందని, అందుకే రాష్ట్రానికి చెందిన ఆస్తులు, అప్పులను పొరుగురాష్ట్రానికి ధారాదత్తం చేసిందనే భావనలో రాష్ట్రప్రజలున్నారని టీడీపీఎమ్మెల్యే చెప్పారు.

జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రకటన అనంతరం, విశాఖలో 30వేలఎకరాల వరకుదోచేశారని, దానితో పాటు సింహాచలం దేవస్థాన భూములను కూడా కాజేయడానికి సన్నద్ధమయ్యారన్నారు.
విశాఖలో చేసిన భూదోపిడీతో పాటు, వైసీపీ ప్రభుత్వం ఇళ్లస్థలాల పేరుతో రూ.4వేలకోట్లు కొట్టేయడం ఇన్ సైడర్ ట్రేడింగో, వన్ సైడ్ ట్రేడింగో సమాధానం చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు.


అధికారంలోకి వచ్చీ రాగానే, జగన్ కు చెందిన సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ కు 1600ఎకరాల పేదలభూమిని అప్పనంగా
కట్టబెట్టారని, అది
ఇన్ సైడ్ ట్రేడింగో... లేక వన్ సైడ్ ట్రేడింగో
బహిర్గతం చేయాలన్నారు.
గుంటూరు జిల్లాలో వాన్ పిక్ కు 18వేల ఎకరాల భూములు కేటాయించి, జగతి పబ్లికేషన్స్ లో నిమ్మగడ్డప్రసాద్ ద్వారా రూ.854కోట్లు పెట్టుబడులు పెట్టించడం ఇన్ సైడ్ ట్రేడింగా.. జగన్ చేసిన వన్ సైడ్ ట్రేడింగా అని నిమ్మల దుయ్యబట్టారు.

సాక్షి పత్రికకు ప్రభుత్వసొమ్ముని ప్రకటనలరూపంలో దోచిపెట్టడం ఎలాంటి ట్రేడింగో జగన్ చెప్పాలన్నారు.

108 వాహనాలపేరుతో రూ.300కోట్లు విజయసాయికి కట్టబెట్టడం వన్ సైడ్ ట్రేడింగా కాదా అని నిమ్మల నిలదీశారు.
మద్యం దుకాణాల ద్వారా రూ.20వేలకోట్లు కొట్టేస్తున్న జగన్, ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా? లేక వన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా అన్నారు.

సిమెంట్ కంపెనీలనుబెదిరించి ఒక్కో సిమెంట్ కట్టకు రూ.125 వరకు ధరపెంచి పేదలను దోచుకుంటున్న తీరుని ఏమంటారో జగన్మోహన్ రెడ్డే చెప్పాలన్నారు.
ఈ విధంగా అవినీతిలో పుట్టి, అవినీతిలో పెరిగిన వైసీపీ, జగన్, తమ అవినీతి బురదను టీడీపీపై వేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. 16నెలలుగా చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ ప్రభుత్వం టీడీపీపై నిందలువేస్తోందన్నారు.

ఒక దొంగకు అందరూ దొంగల్లానే కనిపించినట్లు, జగన్ కు అందరూ అవినీతి పరుల్లా కనిపిస్తున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ఇసుక, మద్యం, మైనింగ్, భూ దోపిడీపై సీబీఐ విచారణ జరిపించే ధైర్యం జగన్ కు ఉందా అని టీడీపీనేత పత్రికాముఖంగా నిలదీశారు.


ఆ పనిచేసే ధైర్యం ముఖ్యమత్రికి లేకపోతే, కనీసం తనపై ఉన్న అవినీతికేసుల విచారణ ఏడాదిలోగా పూర్తయ్యేలా చూడాలని న్యాయస్థానాల్లో అఫిడవిట్ వేసి, తన సచ్ఛీలతను నిరూపించుకునే దమ్ము, ధైర్యమైనా ఆయనకు కు ఉన్నాయా అని రామానాయుడు నిగ్గదీశారు. లెక్కకు మిక్కిలి అవినీతికేసుల్లో
ఏ1, ఏ2లుగా ఉన్నవారు, ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థపై దాడిచేయడం దారుణాలకే దారుణంగా నిమ్మల అభివర్ణించారు.

చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా న్యాయవ్యవస్థలపై దాడిచేస్తున్నారన్నారు.
నేడు దమ్మాలపాటిశ్రీనివాస్ విషయంలో రాష్ట్రహైకోర్టు చెప్పిన దాన్ని తప్పుపడుతున్నవారు,

వివేకానందరెడ్డి హత్యకేసు వివరాలు మీడియాకు రాకూడదని గతంలోఇదే హైకోర్టు చెప్పిన విషయాన్ని గ్రహిస్తే మంచిదన్నారు.


కోర్టులు తమకు
అనుకూలంగా చెబితే, అవి కచ్చితంగా పనిచేస్తున్నాయని చెప్పేవారు, ఇప్పుడు అదే కోర్టులు వారి తప్పులను ఎత్తిచూపితే సహించలేకపోతున్నారని నిమ్మల ఎద్దేవాచేశారు. అవినీతి కేసుల్లో ఏ1, ఏ2 లకు కోర్టులు బెయిల్ ఇచ్చినప్పుడు, వారేమీ చులకనగా మాట్లాడలేదన్నారు.

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పేదలపై ధరలభారం మోపుతూ వారిని మరింత హింసిస్తున్న వైసీపీ ప్రభుత్వం, ఏపీ వాసులను ఆదుకోవాల్సింది పోయి, ధరాఘాతంతో వారిని కోలుకోలేని దెబ్బకొట్టిందన్నారు.దీనిపై మరింత చదవండి :